చట్టాలు అంత చులకనగా ఉన్నాయా. .
*దిశ చట్టం అన్నారు దానికే దశ దిశే లేకుండా పోయింది…
*శక్తి అంటున్నారు ..నారీ శక్తికి అండగా లేదు…
*నేరాలతో నేలరాలుతుంది నారీ లోకం…
*నవ్వుల పాలవుతుంది నవీన సమాజం…
*ప్రాణాలు తీసేందుకు ట్యాగ్ లైన్ ప్రేమ…
*అక్రమ సంబంధాల ముసుగుకు పేరు ప్రేమ…
*నిర్భయ నేర్పిన నీతి ఏమిటీ…
*దిశ ఘటనతో తెలుసుకున్నదేమిటీ ..
*కొవ్వుత్తుల ర్యాలితో కొవ్వెక్కిన మృగాలు కట్టడి అవుతాయా..
*నేరమా అంటే నరాలు వణికించలేరా…
*నా దేశం ఇదేనా కోరుకునేది…
*పాశ్చాత్య సంకృతి పాడు చేస్తుందా…
*ఇంకెన్ని ప్రాణాలు పోతే పటిష్ట చర్యలు ఉంటాయి…
*ఓ ప్రేమ ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావే..
ప్రజాభూమి ప్రతినిధి,క్రైంవిజయవాడ)

అర్థాతురాణాం నగురుర్నబంధు! కామాతురాణాం నభయం నలజ్జా !
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వం !!
ధనాశాపరులకు గురువు, బంధువుల పట్టింపు లేదు, కామం కళ్ళకెక్కిన వాడికి భయమూ, సిగ్గు ఉండదు. విద్యాపేక్ష కలవానికి సుఖము, నిద్ర ఉండదు. ఆకలిగొన్న వానికి రుచి గూర్చి, ఉడకటం గురించి ఆలోచన ఉండదని వేదాలలో చెప్పబడిన విధంగా ..నేడు కామంతో కళ్ళుమూసుకుని పోయిన వారు కీచకులుగా,నయవంచ కులుగా మారి నారీ లోకాన్ని నరకానికి చేరుస్తున్నారు.
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్లని ఆనాడు అన్న దానికి భిన్నంగా అర్ధరాత్రి అపరాత్రి కాకుండా అంతరిక్షంకి వెళ్లి వస్తున్న ఆడది అభద్రతా భావంలో బ్రతకడం తప్ప హాయిగా జీవించే హక్కు లేకుండా పోతుందనేది నిత్య సత్యం గా నిలుస్తోంది. అక్షరాస్యత లేని రోజుల నుంచి అత్యంత మేధా సంపత్తి గలిగిన స్థాయికి చేరిన నేపధ్యంలో రంగం ఏదయిన ఊసర వెళ్లి లాగా రంగులు మార్చే నరరూప రాక్షసులు ఆడవారిపై అతికిరాతంగా ,అత్యంత దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ఈ అరాచకత్వానికి అడ్డుకట్ట వేయలేని నిస్సహాయక స్థితిలో ఉన్నామనే ఆలోచన చేస్తుంటూనే ఆవేదన చెందుతోంది అబల.
ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ లో నానాటికి నారీమణులపై నేరరమయ సంఘటనలు ఓ వైపు కలచి వేస్తుంటే కొందరు మహిళలు కూడా నేరాల్లోకి చొరబడుతున్నారు. ప్రేమ అనే వ్యామోహం లో పడి పుట్టిన పిల్లలను సైతం పైశాచికంగా ప్రాణాలు తీసేస్తున్నారు.ఆయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు చట్టాలు ఎన్నో ఉన్నా అవి చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో కనబడకపోవడంతో అవి అపహాస్యం అవ్వక తప్పడం లేదు
గత ప్రభుత్వం దిశ అనే చట్టాన్ని తెచ్చి దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి కొంత ఏదో చేయాలని భావించిన చట్టాన్ని చట్టబద్దత చేయించడం లో విఫలమైందని చెప్పాలి.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సాంకేతికత ద్వారా సమూల మార్పు తీసుకుని రావాలని చూస్తున్న ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన సమాజాన్ని బాదిస్తూనే ఉంది.
కేవలం ప్రీమ అన్న ట్యాగ్ లైన తో ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి వ్యామోహం కోసం ప్రేమ ముసుగు వేసుకుని పాశ్చాత్య సంస్కృతి కి అలవాటు పడి ఆరు నెలల చిన్నారి నుంచి అరవై నెలల వయసు ఉన్న వారిని కూడా వదలని స్థితిలో ఈ కామాంధులు ఉన్నారు. అలాగే నేడు అక్రమ సంబంధాలకు కూడా ప్రేమ అన్న ముసుగు తొడిగి అమాయకుల జీవితాలను అభాసుపాలు చేస్తున్నారు.దేశం నివ్వెర పోయిన నిర్భయ ఘటన ,దిశ ఘటన లు చూసి కూడా ఈ ప్రభుత్వాలు ,ఈ సమాజం ఏమి నేర్చుకున్నది అంటే అందుకు అంతుచిక్కని సమాధానమే వస్తుంది. ఇన్ని రకాల నేరాలు ఘోరాలు జరుగుతుంటే కొవ్వొత్తుల ర్యాలీ చేస్తే ఆ ఆత్మలకు శాంతి కలుగుతుందని ఆశించడమే తప్ప ఆ క్రూర మృగాలకు సరైన శిక్ష పడే అవకాశాలు ఆలస్యంగా ఉండటంతో ఇంకా అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.దేశంలో ఎన్నో నేరాలను ,ఎన్నో సంఘటనలను ఎన్నో సవాళ్ళను ధీటుగా ఎదుర్కొంటున్న మన పోలీస్ కు ఈ అఘాయిత్యాలకు అడ్డుగట్ట వేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా అంటే అది పొరపాటే అవుతుందని చెప్పాలి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకెన్ని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూడాల్సి వస్తుందో వేచిచూడాలి మరి.