ఏడుకొండల వాడా ఏమిటీ మాకీకర్మ…!
*శ్రీవారి లడ్డులో జంతుల కొవ్వాన్నారు…
*కోర్టులకు మాత్రం కల్తీ నిజమేకానీ కొవ్వులేదని కాగితాలు ఇచ్చారు…
*లేని కొవ్వును ఉందని చెప్పడంలో ఆంతర్యమేమిటీ.
*కోట్లాది మంది భక్తులమనోభావాలు దెబ్బతీయడమేగా..
*సిట్ నివేదిక శ్రీవారి భక్తుల పరువు నిలబెట్టింది గా…
*పామాయిల్ కల్తీ అని సిట్ నివేదిక ఇస్తే…
*జంతువుల కొవ్వు ఎక్కడిది ఎవరి సృష్టి …
*ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులను కూడా తప్పుదోవ పట్టించారుగా..
*శ్రీవారితో చెలగాటం మేల…
*రాజకీయాల కోసం దిగజారి పోయారా… పోతున్నారా…
*దేవుడితో దోబూచు లాటలేల…
*ఆలయాల పై రాజకీయాలేల
*ఇంతకంటే ఇక అన్యాయం ఏముంటుంది…
*సనాతన ధర్మాన్ని చంక నాకిస్తున్నదెవరు…
*హైన్దవ ధర్మాన్ని హేళన చేసినట్లు కాదా…
*నాటి విమర్శలకు నేడేమి సమాధానం చెబుతారు…
*స్వామి క్షమించండి
(రామమోహన్ రెడ్డి)
“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం”అని సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పిన చందాన ఈ నాయకులను ఏమిటితో కడిగినా సరిపోదు అన్న భావన ఆధ్యాత్మిక ప్రపంచం నుండి వ్యక్తమవుతున్నాయి. ఎందుకిలా ఆనాల్సి వస్తుందని అంటే…ఈ వివరాలలోకి వెళ్లాల్సిందే…
తిరుమల ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రం. ఇది కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వెంకటేశ్వరుడిగా ఇక్కడ కొలువై ఉన్నాడని, ఈ ఆలయాన్ని పూర్వం తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. 5,000 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయం చోళ, పాండ్య, విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెంది, నేడు ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.అలాంటి
పరమ పవిత్రమైన ఏడుకొండల వాడి దివ్య దర్శనం అమోఘం అనణ్యం.ప్రపంచంలో ఉన్న కోట్లాది భక్తుల కొంగుబంగారమై ఆరాధింప బడుతూ అత్యంత పవిత్రమైన ఆలయంగా అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా భక్తులకు పర్యాటకులకు కనువిందు చేస్తూ వస్తుంది.అలాంటి పుణ్యక్షేత్రం లోలభించే లడ్డు ప్రసాదం కు ఒక చరిత్ర ఉంది.ఈ లడ్డు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డుదే తొలిస్థానం. తిరుమల ఆలయ ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డుకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు.ఆ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసేరోజుల్లో 19వ శతాబ్ది మధ్యభాగంలో తీపిబూందీ ప్రవేశపెట్టారు. 1940ల నాటికి అదే లడ్డుగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు సంపాదించుకుంది, ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది.ఆ మహా ప్రసాదం కోసం అప్రసాద బాగ్యాన్ని కలిగించే ఆ కలియుగ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రపంచంలో ఉన్న ప్రముఖులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన సన్నిదానం చేరుకోవడానికి ఎంతో ఆత్రుత పడుతుంటారు.అలాంటి పవిత్రత ఉన్న ఆలయానికి కళంకితం తెచ్చారు నేటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకులు. తమ రాజకీయ స్వార్థం కోసం భగవంతుడుని సైతం బ్రష్టు పట్టించెంత పని చేసారు. ఏకంగా శ్రీవారి లడ్డులోనే జంతువుల కొవ్వు కలిపారని ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఈ తిరుపతి లడ్డు వివాదం 2024 సెప్టెంబర్లో వెలుగులోకి వచ్చిన తీవ్రమైన కల్తీ ఆరోపణ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు (బీఫ్ టాలో, పంది కొవ్వు), చేప నూనె వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారుల నివేదికల ఆధారం గా ఆవేదన వ్యక్తంచేశారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ జరిగింది.ఈ ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేత విచారణ జరిపించింది.నెల్లూరులోని ఏసీబీ కోర్టులో సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది, ఇందులో టీటీడీ సిబ్బంది, నెయ్యి సరఫరాదారులు నిందితులుగా ఉన్నారు.దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ నేతృత్వంలోని సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం కల్తీ నెయ్యి నిజమని నిర్ధారించింది. కానీ జంతువుల కొవ్వు కాదని 15 నెలల దర్యాప్తు తర్వాత 36 మంది నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.ఈ నివేదిక ప్రకారం
నిందితుల్లో ఒకరైన అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు తర్వాత సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ వివరాలను సేకరించింది. నెల్లూరు కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో సిట్ ఈ విషయాలను పేర్కొంది. టీటీడీకి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిని సరఫరా చేసే భోలే బాబా ఆర్గానిక్ డెయిరీకి సుగంధ్ మోనోడిగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలను సరఫరా చేయగా వీటితోనే నెయ్యిని తయారు చేశారని సీబీఐ గుర్తించింది.స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి నూనెలను మరియు బీటా కెరోటిన్ వంటి రసాయనాలను వాడినట్లు విచారణలో తేలినట్టు అధికార వర్గాల ద్వార వ్యక్తమవుతోంది.80 శాతం రసాయనాలతో కూడిన నెయ్యి వాడకం జరిగినట్లు సిట్ పేర్కొన్నప్పటికీ, జంతువుల కొవ్వు వాడారన్న ఆరోపణలకు సంబంధించి సాంకేతిక ఆధారాలు లభించలేదని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయనేది ఇంకో వాదన.అయితే 2019లో నెయ్యి సేకరణకు సంబంధించిన టెండర్ నిబంధనలను సడలించడం వల్లే ఈ భారీ కుంభకోణం జరిగిందని సిట్ తన నివేదికలో స్పష్టం చేసినట్లుగా తెలిసింది. అయితే గత ప్రభుత్వంలో అనేక రాష్ట్రాల్లో టిటిడి ఆలయాలను నిర్మించడం కూడా జరిగింది. అయితే టీటీడీ చైర్మన్ గా ఉన్న వారు తమ బోర్డు సభ్యుల తీర్మానం తో నిబంధనల సడలింపు అనేదే ఇక్కడ ప్రధాన సమస్య గా మారింది.తిరుమల కు వెళ్లే మార్గం డేగ కళ్ళతో ఇరవై నాలుగు గంటలు నిఘా ఉంచిన కొందరు దారి తప్పిన పనులకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.ఇక దేవుడిని సైతం దోచుకోవడానికి ఏమాత్రం వెనుకాడని ఈ రోజుల్లో నిబంధనలు సడలింపు అనేది పెద్ద తప్పిదాన్ని తెచ్చిపెట్టక తప్పదు.ఐదేళ్ల కొక్క సారి అధికారం లో ఉండే రాజకీయ నాయకులు తమ ఆలోచనలు సుదీర్ఘ అనుభవం పరిపాలన దక్షత ఉన్న అధికారులు, ఆగమ శాస్త్ర పండితులు అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని వాటి సాధ్యా సాధ్యాలను పరిశీలన చేసినప్పుడే కొన్ని వివాదాలు తలెత్తకుండా ఉంటాయనేది లోకోత్తర ధర్మం. ఇక్కడ ఆలయం ముఖ్యం,ఆ ఆలయ ప్రాశస్త్యంఅన్నిటికంటే అతి ముఖ్యమైనది.అలాంటి ప్రాచీన ఆలయాలకు రాజకీయ నాయకులు తమ అతితెలివి కావచ్చు,లేక అత్యుత్సాహం కావచ్చు ఏదో చేసి చేసి గొప్పగా చూపించుకోనే ప్రయత్నం అవ్వచ్చు ఫలితం గా పవిత్ర ఆలయాలకు రాజకీయ గ్రహణం పట్టిస్తూ ఆ ఆలయ పవిత్రను అపవిత్రం చేస్తున్నారని చెప్పక తప్పడం లేదు. అధికారులు తప్పు చేస్తున్నారని బోర్డు ఉన్నా ఇద్దరూ కలిసి తమ అనాలోచిత నిర్ణయాలతో అసలకే మోసం వస్తుందనేది నిత్య సత్యంగా మారుతోంది.
ఇవన్నీ గమనించని నేతలు తమ రాజకీయ మనుగడ కోసం అధికార ప్రతిపక్ష పార్టీల ఆధిపత్య పోరుతో ఆలయ పవిత్రతను ఆగమం చేస్తున్న సందర్భం చోటు చేసుకుంది. పోనీ ఇదే ప్రభుత్వం ఉంటుందా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్ల ఒకసారి ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఎవరి కుర్చీని లాగేస్తారో తెలియని వైచిత్రి.ఇప్పుడు కూటమి ప్రభుత్వం లో ఇలా రేపు వైసీపీ ప్రభుత్వం వస్తే పునర్విచారణ పేరుతో అనేక ఆరోపణలు రావచ్చు. అంతిమంగా ప్రజల్లో హేవగింపు పుట్టే విదానాలు వుండబోతాయన్నది జగమెరిగిన సత్యం.
ఇక చివరకు తేలినది ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ ఆయిన ప్రజాప్రయోజనాలు దృష్ట్యా పరిపాలన సాగించాలే తప్ప పరువునష్టం కలిగించే పనులు చేస్తే అది ప్రజాస్వామ్య విఘతానికి దారితీయక తప్పదని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.

