ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రూ.30.66 కోట్లు నిధులు కేటాయింపు
• 24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు
• టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు
• 48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు
• లక్షలాది భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా అభివృద్ధి పనులు
ప్రజాభూమి ప్రతినిధి, అమరావతి:
“ఆధ్యాత్మికత కొలువైన క్షేత్రంలో అభివృద్ధి ఉండాలి.. చరిత్ర ఉన్న చోట పరిరక్షణ ఉండాలి.. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి” అనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పం. పిఠాపురం నియోజకవర్గ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ, ఆ వైభవాన్ని భవిష్యత్ తరాలకు మరింత ఘనంగా అందించాలనే ఆయన కార్యాచరణ ఇప్పుడు క్షేత్రస్థాయిలో రూపుదాలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రత్యేక చొరవ తీసుకొని, నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి , భజన మందిరాల నిర్మాణం, కళ్యాణ మండపాల ఏర్పాటు కోసం ఏకంగా రూ. 30.66 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఆయన నిరంతర పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు ప్రస్తుతం నియోజకవర్గవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి.
భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయాల ఆధునీకరణ
నియోజకవర్గంలోని 24 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.17.06 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతులతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం తుది దశకు చేరింది. కొత్తపల్లిలోని జగన్నాథ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. పిఠాపురం కొత్తపల్లి వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుల క్వార్టర్ల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయంలో కాలక్షేప మండపం, రామకృష్ణాపూర్ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రాజగోపురం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి రూ.5 కోట్లు, శ్రీ పాద శ్రీవల్లభ దేవస్థానానికి రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు మొదలు కానున్నాయి. పునరుద్ధరణ జరుగుతున్న ఆలయాల్లో శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన 10వ శతాబ్దం నాటి శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయంతోపాటు, పిఠాపురం మహారాజుల కాలం నాటి అనేక పురాతన దేవాలయాలు ఈ ప్రాజెక్టు ద్వారా సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు ఏటా సుమారు 13.76 లక్షల నుంచి 18.07 లక్షల మంది భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లోనే కాకుండా పండుగలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఆయా పర్వదినాల్లో రోజుకు 20 వేల నుంచి ఏకంగా 50 వేల మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల ఆధునీకరణ పనులు చేపడుతున్నారు.
అత్యాధునిక వసతులతో టీటీడీ కల్యాణ మండపం
పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో గతంలో పాడా ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని అన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మించారు. అలాగే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ మాడ వీధుల విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం యు.కొత్తపల్లి మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. వివాహాలు, ధార్మిక కార్యక్రమాలు, ఇతర సామాజిక అవసరాలకు అనువుగా అత్యాధునిక వసతులతో ఈ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు.
భజన మందిరాలతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ
కాకినాడ జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో 419 భజన మందిరాలను పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో తొలి దశలో 48 భజన మందిరాల నిర్మాణానికి రూ.11.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ భజన మందిరాలు కేవలం భక్తి కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. భజనలు, ఆధ్యాత్మిక సమావేశాలు, స్థానిక సాంస్కృతిక వేడుకలు, గ్రామస్థాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా రూ.30.66 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణతోపాటు ఆలయాల ఆధునికీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, గ్రామీణ సామాజిక వేదికల బలోపేతానికి దోహదపడనున్నాయి.


