మహిళలపై అత్యాచారనివారణ దినం!
++++++++++++++++
ఆమె..
దుర్మార్గుల పీచమణిచే వరకు జుట్టు ముడివేయక ప్రతినబూని కౌరవ హతకుల అంతు చూసిన మానధనురాలు ద్రౌపది..!
సాక్షాత్తు దేవదేవుడు శ్రీకృష్ణుడు చెంతనుండగా విల్లు చేబట్టి
నరకాసురుని మట్టుబెట్టిన
శూరాంగణ సత్యభామ..
ఇవి పురాణాలు..
ఆమె..
జగమునందే తొలిమహిళా మంత్రిగా వినుతికెక్కి మంత్రాంగములలో ఆరితేరిన
గజనిమ్మ నాగమ్మ..
బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసి వీరత్వమునే బిరుదుగా బడసి ఉవ్వెత్తున ఎగసిన
పోరాటకెరటం ఝాన్సీ..
ఖిల్జీలను ఎదురొడ్డి పోరాడి అలసి చివరకు మానరక్షణ కోసం ప్రాణత్యాగమొనర్చిన
ప్రతిభావతి పద్మావతి…
ఇవి చరిత్రలు..
మన కనులెదుట..
సువిశాల భారతావనిలో
మహాసామ్రాజ్ఞిగా ఏకచక్రాధిపత్యంతో
ఏలుబడి సాగించి
ఆధునిక ప్రపంచ దిగ్గజాల ప్రశంసలు అందుకున్న
ఉక్కుమహిళ ఇందిర..
కొప్పును ముడికట్టి ఆపై టోపీ పెట్టి..వంటింటి కుందేలును కాదంటూ ఒంటికి ఖాకీ దుస్తులు చుట్టి..
చేత లాఠీ పట్టి
కరకు నేరగాళ్ల
ఆటలు కట్టించి..
జైళ్ల సంస్కరణకు
నడుం కట్టి
ఉడుం పట్టు పట్టి మగధీరులను మించిన
తొలి మహిళా
ఐపీఎస్ అధికారి
కిరణ్ బేడీ..
ఇలాంటి వీరనారీమణులు..
ధీరోదాత్త వనితలను కనిన..గనిన గడ్డ ఇది..!
అంతేనా..
సృష్టికి మూలం..
విధాతకు మరోరూపం..
మగవాడి విజయం వెనక ఉండే శక్తి..
ఎన్నో యుద్ధాలకు కారణమైన మహాశక్తి..
ఇంటిని నడిపే ఆదిశక్తి..
జగతిని శాసించే పరాశక్తి..!
ఈ రోజున
ఇలా బేలగా..నిరాశగా..
సంతలో పశువై..
మగవాడి కామదాహానికి బలిపశువై శోకిస్తూ..రోదిస్తూ..
విలపిస్తూ..పరితపిస్తూ..
అలమటిస్తోందే..
ఏంటి కారణం..
ఎందుకింత దారుణం..?
మగవాడి అహంకారం..
ప్రభుత్వాల నిర్లిప్తత..
చట్టాల లోపాలు..
న్యాయస్థానాల ఉదాసీనత..
పోలీసుల ధోరణి..
సమాజంలో పేరుకుపోయిన నిర్లక్ష్యం..నిరాసక్తత..
ఇలాంటి ఎన్నో కుళ్లు వ్యవస్థలు
నువ్వు..నేను..మనం
అందరం భాగస్వాములమే..
మానభంగం చేసి వాడు..
మౌనభంగం చేయక మనం..
మనింటి పిల్ల కాదుకదా
అనే భావం..
మనింటి పిల్లే అయితే పరువు పోతుందేమోనని భయం..
ఇలాంటి బలహీనతలే ముష్కరుల బలాలు..!
పోలీస్ స్టేషన్ కి
వెళ్తే ఖాకీలు కాకుల్లా
పొడుచుకు తింటారని..
కోర్టుకెక్కితే లాయర్లు ప్రశ్నలతో
గాయాలు చేస్తారని..
ఈలోగా సభ్యసమాజం
ముసుగులో ప్రతి గుంటనక్కా చూసే
వెధవ చూపులు
వేసే దొంగవేషాలు..
జరిగిన ఘోరాలను అడ్డుపెట్టుకుని రకరకాల వేధింపులు.. సాధింపులు..
పరువుకు భయపడి
తల్లిదండ్రులే నోరు నొక్కేసే
ఇంటింటి శాకుంతలాలు..
ఆడకూతురి పాలిట అత్యాచారాన్ని మించిన దురాచారాలు..
ఘోరాచారాలు..
మానభంగాలు..హత్యలు
బయటపడుతున్న దురాగతాలు మాత్రమే..
ఇంట్లో..కార్యాలయాల్లో..
చివరకు దేవాలయాల్లో..
బస్సుల్లో..రైళ్లలో..
దుకాణాల్లో.. సినిమాహాళ్ళలో..
సినిమాలలో..సీరియళ్లలో..
ముట్టుకోడాలు,పట్టుకోడాలు
ప్రతిఘటిస్తే మట్టుపెట్టడాలు..
ఆడదంటే అలుసు..
స్పందన ఉండని
ముద్ద దినుసు
ప్రేమ..పెళ్లి..
అన్నీ మగవాడి ఇష్టం..
అంగీకరిస్తే బానిస..
తిరగబడితే హీనస..
నిరాకరిస్తే హింస..
ప్రతిఘటిస్తే హత్య..
ఇంటింటా ఇదే పురాణం
మౌనరోదనం
చట్టాల మౌనగీతం..!
మరి నిష్కృతి ఎలా..
మార్పు..సత్వర తీర్పు..
పటిష్టమైన చట్టాల కూర్పు..
నశించిన ఓర్పు..!
వేధించే ప్రశ్నలు..
వెంటాడే కళ్లు..
కుళ్ళబొడిచే మాటలు..
ములుకుల్లాంటి ఆరోపణలు..
శిక్షలు భయాన్ని పెంచుతాయేమో..
పరివర్తన తేలేవు..
ఇంకా..ఇంకా
అధ్యయనం జరగాలి..
వ్యవస్థలు మారాలి..
అన్నిటికంటే…..
మనుషులు మారాలి…!
✍️✍️✍️✍️✍️✍️✍️
సురేష్ కుమార్
9948546286