అయోధ్య : రామ జన్మభూమి అయోధ్యలో నిర్మించిన రామమందిరాన్ని నేడు(సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రామమందిరమే కాదు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. అద్భుత శిల్పసంపదతో సహజంగానే ఆకట్టుకునే రాములోరి కోవెల విద్యుత్ దీపాలు, పూల అలంకరణతో మరింత అందంగా మెరిసిపోతోంది. ప్రస్తుతం అయోధ్య నగరం మొత్తం రామనామ స్మరణతో ఆద్యాత్మక శోభ సంతరించుకుంది.
దేశ విదేశాలకు చెందిన ప్రముఖులంతా ప్రస్తుతం అయోధ్యబాట పట్టారు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు ఇతర రంగాలకు చెందినవారు, సాధుసంతులు అయోధ్యకు చేరుకుంటున్నారు. దాదాపు ఏడువేల మందికిపైగా అతిథుల సమక్షంలో ప్రధాని మోదీ అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటల నుండి 1 గంట వరకు గల శుభ ముహూర్తంలో ప్రధాని చేతులమీదుగా ప్రత్యేక పూజలు చేయించనున్నారు పండితులు.