హిందూపురంటౌన్ :అమ్మాయిల చదువే వారి భవిష్యత్తుకు రాచబాట వేస్తుందని, మీ కుమార్తెలను ఉన్నత చదువులు చదివించే దిశగా తల్లిదండ్రులు శ్రధ్ధ చూపాలని ఎన్.ఎస్.పి.ఆర్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రగతి తల్లిదండ్రులను కోరారు. సోమవారం కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తమ కళాశాలపై నమ్మకంతో మీ కుమార్తెలను తమ కళాశాలలో చేర్చినందుకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. మీ నమ్మకానికి తగినట్లుగా అధ్యాపకులు అంకితభావంతో విద్యార్థినులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు. కంప్యూటర్ క్లాసులు, పోటీ పరీక్షల కోసం క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. హాస్టల్ లో విద్యార్థినిలు స హృద్భావంతో సర్దుకుపోవడానికి తల్లిదండ్రులు సహకరించాలని, వారి ఆరోగ్యం, క్రమశిక్షణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కళాశాల సిబ్బంది అంకితభావంతో కృషి చేస్తున్నారని, వారి కృషికి తగిన మద్దతు తల్లిదండ్రుల నుంచీ రావాలని కోరారు. పౌష్టికాహారంతో కూడిన మెనూ తయారుచేసి, దానికి తగిన విధంగా భోజనం ఏర్పా టు చేశామని తెలిపారు. విద్యార్థినులు, కోరినట్లుగా అదనపు సమయంలో లైబ్రరీ తెరచి ఉంచుతూ. అనేక పత్రికలు అందుబాటులో ఉండేలా తెప్పిస్తున్నట్లు వివరించారు. మెడికల్ క్యాంప్, కౌన్సిలింగ్ తరగతులు ఏర్పాటు చేస్తామని, క్రమశిక్షణ విషయంలో రాజీపడబోమని దానికి తగినట్లు తల్లిదండ్రులు కూడా ఔటింగ్, సెల్ ఫోన్లు వంటి అంశాలలో తమపై ఒత్తిడి చేయకుండా సహకరించాలని కోరారు. విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తెల పట్ల శ్రద్ద వహిస్తున్న కళాశాల సిబ్బందికి ధ న్యవాదాలు తెలిపారు. కళాశాల, వసతి గృహంలో అన్ని వసతులతో పాటు అనుభవజ్ఞులైన, అత్యధిక విద్యార్హతలు గలిగిన అద్యాపకులు ఉన్నా ఈ కళాశాలలో తమ బిడ్డ లు చదవడం తమకు ఆనందదాయకమన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశులు, డిప్యూటీ వార్డెన్ డాక్టర్ సరస్వతి, అధ్యాపకులు డాక్టర్ శ్రీలక్ష్మి, గోపాల్, నరసింహులు, మడకశిర, రొద్దం, పెనుకొండ, కళ్యాణదుర్గం, చిలమత్తూరు, పరిగి, సోమందేపల్లి తదితర ప్రాంతాల నుండి విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.