తాజా వార్తలుఅన్నవరం కల్యాణకట్టలో ‘కృత్రిమ’ లూటీ

అన్నవరం కల్యాణకట్టలో ‘కృత్రిమ’ లూటీ

:*దేవుడికి రూ. 40 టికెట్
*అదనంగా వందిస్తేనే గుండు!
*​కాగితాలకే పరిమితమైన సిబ్బంది సంఖ్య
*డ్యూటీలో కొద్దిమందే ఉండటం వెనుక అంతరార్థం ఏంటి?
​ప్రజాభూమి ప్రతినిధి, కాకినాడ:


ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భక్తుల ఇబ్బందులు నానాటికీ హెచ్చుమీరుతున్నాయి. స్వామివారి దర్శనార్థం కొండపైకి వచ్చే భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకునే క్రమంలో ఎదురవుతున్న అవినీతి పర్వంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సత్య దేవుని సన్నిధిలో తలనీలాలు సమర్పించుకునే కేశఖండన శాల (కల్యాణకట్ట) అక్రమాలకు, బలవంతపు వసూళ్లకు నిలయంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
​రూ. 100 ఇస్తేనే మర్యాద.. లేదంటే ఇష్టం వచ్చినట్టు!
దేవస్థానo నిబంధనల ప్రకారం భక్తులు తలనీలాలు సమర్పించుకోవడానికి ముందుగా కౌంటర్ వద్ద రూ. 40 చెల్లించి అధికారికంగా దేవస్థానానికి చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కళ్యాణ కట్ట లోకి వెళ్ళాలి.కానీ ఈ టికెట్ కేవలం లోపలికి ప్రవేశించడానికే పరిమితమవుతోంది. టికెట్ పట్టుకుని కేశఖండన శాలలోకి వెళ్లిన భక్తులకు అక్కడి నాయి బ్రాహ్మణుల నుండి విచిత్రమైన డిమాండ్లు ఎదురవుతున్నాయని భక్తుల నుండి ఆరోపణలు ఉన్నాయి.చేతిలో బ్లేడు పట్టిన సిబ్బంది, భక్తుల నుండి అదనంగా వంద రూపాయలు (రూ. 100) డిమాండ్ చేస్తున్నారని అడిగినంత ఇస్తేనే గుండు సరిగ్గా గీస్తున్నారని, లేనిపక్షంలో అరకొరగా, తమకు ఇష్టం వచ్చినట్లు గీసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని డబ్బులు ఇవ్వని వారి పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ, పవిత్రమైన క్షేత్రంలో కనీస మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని భక్తులు వాపోతున్నారు.

*ఎంతమంది డ్యూటీ చేయాలి? అక్కడ ఉన్నది ఎంతమంది?
కేశఖండన శాల రికార్డుల ప్రకారం అసలు ఎంతమంది నాయి బ్రాహ్మణులు డ్యూటీలో ఉండాలి? ఎంతమందికి జీతాలు చెల్లిస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నం మవుతున్నాయి.క్షేత్రస్థాయిలో చూస్తే కేవలం కొంతమంది సిబ్బంది మాత్రమే అక్కడ డ్యూటీ చేస్తూ కనిపిస్తున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నా.. మిగిలిన సిబ్బంది ఎటు పోయారు? కాగితాల్లో ఎక్కువ మందిని చూపిస్తూ, లోపల మాత్రం కొద్దిమందితోనే ఎందుకు నడిపిస్తున్నారు? ఈ విషయం అధికారులకు తెలిసే జరుగుతోందా అని భక్తులు మండిపడుతున్నారు. భక్తులు గంటల తరబడి లైన్లలో వేచి ఉండేలా చేసి, ఆ ఒత్తిడిని ఆసరాగా చేసుకుని అడిగినంత వసూలు చేయడానికి ఈ ‘కృత్రిమ కొరత’ను సృష్టిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
​అధికారులకు వాటాలు అందుతున్నాయా?
కేశఖండన శాలలో నిత్యం ఇంత బహిరంగంగా లూటీ జరుగుతున్నా, అక్కడ విధుల్లో ఉండే సూపరింటెండెంట్లు, గుమస్తాలు (ఆలయ సిబ్బంది) ఏమాత్రం పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. భక్తుల నుండి నాయి బ్రాహ్మణులు ఇంత దోపిడీ చేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? హాజరు పట్టికలను సరిగ్గా ఎందుకు తనిఖీ చేయడం లేదు? ఈ వసూళ్లలో అక్కడి అధికారులకు కూడా వాటాలు అందుతున్నాయా? అందుకే వీరు ఈ లూటీని చూస్తూ చూడనట్లు నటిస్తున్నారా? అని భక్తులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
​ఈవో నల్లం సూర్యచక్రధర్ రావు స్పందించాలి
దేవస్థానo ప్రతిష్టను మసకబారుస్తున్న ఈ వ్యవహారంపై దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధర్ రావు తక్షణమే స్పందించాలని భక్తులు, స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కేశఖండన శాలలోని బయోమెట్రిక్ హాజరు, డ్యూటీ రిజిస్టర్లు మరియు సీసీటీవీ (CC) ఫుటేజీలను స్వయంగా పరిశీలిస్తే అక్కడ సిబ్బంది కొరత వెనుక ఉన్న అసలు భాగోతం, అక్రమ వసూళ్ల వ్యవహారం బయటపడుతుందని, తద్వారా సామాన్య భక్తులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
​భక్తుల ప్రధాన డిమాండ్లు
​హాజరు, సీసీ ఫుటేజ్ పరిశీలన చేసి కల్యాణకట్ట రికార్డులను, సీసీ ఫుటేజీలను తనిఖీ చేసి, డ్యూటీకి రాకుండా జీతాలు పొందుతున్న వారిని, అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించాలి.
సిబ్బంది పూర్తిస్థాయి లభ్యత
షిఫ్టుల ప్రకారం కేటాయించిన నాయి బ్రాహ్మణులందరూ విధుల్లో ఉండేలా చర్యలు తీసుకుని, భక్తుల వేచి ఉండే సమయాన్ని తగ్గించాలి.
బాధ్యులపై కఠిన చర్యలు
భక్తులను వేధిస్తూ అదనపు డబ్బులు వసూలు చేసే సిబ్బందితో పాటు, పర్యవేక్షణలో విఫలమై, వాటాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపరింటెండెంట్లు, గుమస్తాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని భక్తులు దేవస్థానం అధికారులను కోరుకుంటున్నారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article