- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్
వేంపల్లె
ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కట్టడం అయోధ్య రామ మందిరం అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అన్నారు. స్థానిక పట్టణంలో ఉన్న రామాలయాలకు బీజేపీ నాయకులతో కలసి పట్టు వస్త్రాలు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 500 సంవత్సరాల రామభక్తుల కల ఈనెల 22వ తారీకు న నెరవేరబోతుందని ఆరోజున దేశ ప్రజలందరూ దీపావళి నిర్వహించాలని చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణంకోసం రామభక్తులు, కరసేవకులు, అధ్యాత్మికవేత్తలు వివిధ రకాలుగా ఉద్యమాలుచేసి సుమారు 4 లక్షల 50 వేల మంది ప్రాణ త్యాగం చేసిన అనంతరం మన దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారి చొరవతో అందరినీ ఒప్పించి సుప్రీం కోర్టులో సాక్షాలను చూపించి వారి ఆదేశాల మేరకు రామ మందిర నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని అన్నారు. దేశ చరిత్రలో ప్రతిఒక్కరు నిర్వహించబోతున్న పెద్ద పండుగ అని అన్నారు. ఇప్పటికే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ప్రతి ఇంటికి చేర్చడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోమవారం రోజున స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రసార మాద్యమాల ద్వారా వీక్షించి అక్షింతలను తలపై చల్లుకోవాలని తెలిపారు. అదే విధంగా సాయంత్రం 6 గంటలకు ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించి దీపావళి నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పి. సుస్మా, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. ప్రసాద్ రెడ్డి, దొంతు సుమన్, సురేష్, నాగ పవన్ తదితరులు పాల్గొన్నారు.