మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అజ్ఞాతంలోకి వెళ్లపోయారు. 24 గంటలుగా కనిపించకుండా పోయారు. ల్యాండ్ ఫర్ సేల్ స్కాం కేసులో సోరెన్ ఈడీ సమన్లను జారీ చేసింది. ఈడీ సోరెన్‌కు ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. ఈడీ సమన్లను సీఎం హేమంత్ సోరెన్ పట్టించుకోకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోరెన్ కోసం ఈడీ బృందం గాలిస్తుంది.
మరోవైపు సొరేన్ పార్టీ నేతలు స్పందిస్తూ… రాంచీకి ఆయన త్వరలోనే చేరుకుంటారని చెప్పారు. రాజకీయ కుట్రల్లో భాగంగానే సొరేన్ ను ఈడీ వేధిస్తోందని మండిపడ్డారు. పార్టీ జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య మాట్లాడుతూ… వ్యక్తిగత పనులపై సీఎం సొరేన్ ఢిల్లీకి వెళ్లారని, ఆయన వెనక్కి వస్తారని చెప్పారు. ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఝార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ మాట్లాడుతూ… సొరేన్ ఎక్కడున్నారనే విషయంపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం మిస్సింగ్ అంటూ పుకార్లను పుట్టిస్తున్నారని అన్నారు.
భూ కుంభకోణం కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్‌ను ప్రశ్నించింది. అనంతరం జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ సమన్లు జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సోరెన్ ఏజెన్సీకి లేఖ పంపారని, అయితే తాను విచారణకు హాజరయ్యే తేదీని దానిలో పేర్కొనలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

