Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఆమోదించింది నాటి చంద్రబాబు సర్కారే

ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఆమోదించింది నాటి చంద్రబాబు సర్కారే

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

భూముల సర్వేలన్నీ పూర్తయి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాల పరిష్కారం మరింత సులభతరమవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి నాడు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తిగా ఆమోదముద్ర వేసిందని ఆయన గుర్తు చేశారు. దమ్ముంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఓ చెత్త చట్టమని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ల ద్వారా చంద్రబాబు ఒక మాటైనా చెప్పించగలరా అని సజ్జల సవాల్ చేశారు. చంద్రబాబు తన పదవీ కాలంలో చేసిన మంచి పనులేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతోనే వైసీపీ ప్రభుత్వంపై ఈ విధమైన దుష్ర్పచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరైనా ఎన్నికలు దగ్గరకొస్తే తమ పార్టీ ఏంచేస్తుందో ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఇచ్చుకుంటుందని, అయితే తెలుగుదేశం పార్టీ చేయగలిగిందేమీ లేకపోవడంతోనే ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది భూ యజమానికి ప్రభుత్వం తరఫున పూర్తి హామీ ఇవ్వడమేనని సజ్జల స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. నాడు టైటిలింగ్ చట్టానికి ఆమోద ముద్ర వేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని నేడు అదే పార్టీ ఈ చట్టంపై దుష్ర్పచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ దుష్ర్పచారం చేస్తోందన్నారు. ఈ విధమైన ప్రకటనల ద్వారా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అభాండాలు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబుది దింపుడుకళ్లెం ఆశని ఎద్దేవా చేశారు. ఇటువంటి దుష్ర్పచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబు హామీలను, ఆయనను ప్రజలెవరూ నమ్మడం లేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article