హాజరైన కాకినాడ ఎంపీ గీత అధికార పార్టీ అధికార దుర్వినియోగంపై విమర్శలు

గొల్లప్రోలు : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతకు అనుగుణంగా అధికార వైసీపీ అడుగులు వేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపుగానే ప్రభుత్వపరంగా నియమితులైన వాలంటీర్లను పార్టీ ప్రచారానికి వినియోగించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గొల్లప్రోలులో మంగళవారం వైసీపీ పార్టీ పరంగా వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షపార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొల్లప్రోలు లోని శ్రీ సత్య కృష్ణ ఫంక్షన్ హాలు లో వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ఆధ్వర్యంలో సంక్షేమ సైనికులతో ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా సదరు సమావేశానికి స్థానిక ప్రజా ప్రతినిధులను, పార్టీ నాయకులను కానీ ఆహ్వానించలేదు. కాకినాడ ఎంపీ,పిఠాపురం వైసీపీ ఇన్ చార్జ్ వంగా గీతా విశ్వనాథ్ మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ వాలంటీర్లు అందరూ వైసీపీ ప్రభుత్వం మరలా అధికారం చేపట్టే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తాను గతంలో మూడుసార్లు పోటీ చేసి పరాజయం పొందినా ప్రస్తుతం సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు మరలా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనేది తన కల అని వివరించారు. తాను ఎంపీగా విజయం సాధిస్తే నియోజకవర్గం పరిధిలోకి 400 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయలు చొప్పున నిధులు కేటాయిస్తామని చెప్పారు. అలాగే 100 కోట్ల రూపాయలతో స్టార్ట్ అప్ పండ్ ఏర్పాటు చేసి వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉన్న యువతీ, యువకులకు చేయూతనం దిస్తామని తెలిపారు. వాలంటీర్లు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా తమకు అనుకూలమైన వారితో పార్టీ కోసం ప్రచారం చేయించాలని కోరారు. బలమైన ప్రత్యర్థి పై విజయం సాధించినప్పుడే మజా ఉంటుందని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎంపీ గీత మాట్లాడుతూ కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలను గుర్తు చేశారు. వాలంటీర్ల పై ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న నమ్మకానికి అనుకూలంగా అందరూ పని చేయాలని సూచించారు. కాగా ప్రభుత్వపరంగా నియమించిన వాలంటీర్లతో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సమావేశం నిర్వహించడం, సదరు సమావేశానికి అధికార పార్టీ ఎంపీ హాజరు కావడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
