Wednesday, May 7, 2025

Creating liberating content

తాజా వార్తలువైసిపి కౌన్సిలర్ భర్త ఆత్మహత్య

వైసిపి కౌన్సిలర్ భర్త ఆత్మహత్య

కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన వైకాపా నేత
వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు


హిందూపురంటౌన్:శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘంలోని 34వ వార్డు వైసిపి కౌన్సిలర్ నాగమణి భర్త నాగరాజు ఆత్మహత్య చేసుకుని, మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల మేరకు కౌన్సిలర్ నాగమణి భర్త నాగరాజు మంగళవారం మధ్యాహ్నం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి ఉప్పు నీళ్లు తాగించి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు వైద్య సేవలను అందించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న నాగరాజు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. అయితే ఇతని ఆత్మహత్య వెనుక కారణాలు కుటుంబ సభ్యులు వెల్లడించ లేదు. తాగుడుకు బానిసై మద్యంతో పాటు క్రిమిసంహారక ముందు తీసుకున్నట్లు భార్య నాగమణి, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైసిపి నేత వేణురెడ్డి ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కౌన్సిలర్ నాగమణికి ఆర్థిక సహాయాన్ని అందించి ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. అదే విధంగా వన్ టౌన్ పోలీసులకు కేసు నమోదు చేసుకుని, మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని సూచించారు. ఈయన వెంట వైసిపి నాయకులు చాంద్ బాషా ఉన్నారు.

వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైస్ చైర్మన్ లు
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రోహిల్ కుమార్, వైద్యుల తీరుపై మున్సిపల్ వైస్ చైర్మన్లు బలరామిరెడ్డి, జబీవుల్లా, పలువురు కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించి, ప్రతినెలా వైద్యుల పోస్టులను భర్తీ చేసి, ప్రభుత్వ వైద్య వ్యవస్థను పటిష్టం చేస్తుంటే, స్థానికంగా ఉన్న వైద్యులు వారు నిర్వహించే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక ప్రజా ప్రతినిధి భర్తకే వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, ఇక సామాన్యులకు ఏమాత్రం వైద్య సేవలు అందిస్తున్నారు అర్థమవుతుందని అన్నారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రోహిల్ కుమార్ కు పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదని, ఆయన కార్యాలయంలోకి వెళ్ళినప్పటికీ తమది తప్పే లేదన్నట్టు, నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించాలని పోలీసు శాఖ లేఖ ఇచ్చి కోరినప్పటికీ సకాలంలో చేయలేదని, కనీసం ఏ సమయానికి చేస్తారన్న విషయాన్ని సైతం చెప్పడం లేదన్నారు. అందరం కలిసి ఆందోళన చేయడానికి సిద్ధం కావడంతో, వెంటనే పోస్టుమార్టం నిర్వహించడానికి వైద్యుడిని నియమించి, పోస్టుమార్టం నిర్వహించారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి స్వగృహానికి తరలించారు. అధికార ప్రతిపక్ష నాయకులతోపాటు, పలువురు కౌన్సిలర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article