వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో జగన్ తన కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల పర్యటనలకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు షెడ్యూల్ ఖరారు కానుంది. రెండు లక్ష్యాలతో జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
జగన్ సమీక్షలు వైసీపీ అధినేత జగన్ భారీ ఓటమి పైన సమీక్షలు చేస్తున్నారు. తాను ఈ ఓటమి ఊహించలేదని వాపోతున్నారు. పార్టీ నేతలు జిల్లాల వారీగా జగన్ తో సమావేశం అవుతున్నారు. ఓటమి కారణాలు అంతు చిక్కటం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉండటంత తమకు కొత్త కాదని చెబుతూనే…ప్రజల తరుపున నిలబడదామని పార్టీ నేతలకు జగన్ సూచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మారిన తరువాత పలు ప్రాంతాల్లో రాజకీయంగా దాడులు జరిగాయి. వైసీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు.
కేడర్ కు భరోసా కేవలం 11 స్థానాలకు వైసీపీ పరిమితం కావటం ఆ పార్టీ శ్రేణులకు అంతు చిక్కటం లేదు. దీంతో..ఎన్నికల ముందు..పోలింగ్ రోజున దాదాపు 18 లక్షల శాంపిల్స్ తో చేయించిన సర్వే లెక్కలను పార్టీ నేతలతో జగన్ విశ్లేషించారు. పూర్తిగా సానుకూలత కనిపించిందని…కానీ, ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని విశ్లేషించారు. ఇదే సమయంలో జగన్ కోటరీ..సీఎంఓలో అధికారుల పైన పలువురు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు వాస్తవాలు తెలియనీయకుండా..వీరంతా మోసం చేసారని వాపోతున్నారు. ఐప్యాక్ పని తీరు పైన విమర్శలు మొదలయ్యాయి. సజ్జల, ధనుంజయ రెడ్డిపైన మండిపడుతున్నారు.జగన్ పర్యటన ఇక..జగన్ వచ్చే వారం జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీని జగన్ పట్టించుకోలేదనే వాదన ఉంది. కేడర్ ఇప్పుడు ఓటమి తరువాత నిరుత్సాహం లో ఉంది. ఇదే సమయంలో దాడులు జరిగిన వారిని జగన్ పరామర్శించనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ నెల మూడో వారంలో జగన్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.