అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన జగన్!
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై మాజీ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. తమకు విపక్ష హోదా ఇవ్వరాదని ముందే నిర్ణయించుకున్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అంతేతప్ప, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో పాటు స్పీకర్ కూడా శత్రుభావంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో తాము గొంతు విప్పి మాట్లాడే పరిస్థితులు లేవని భావిస్తున్నామని జగన్ వెల్లడించారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధ భాగస్వామ్యం ఉంటుందని, ఈ నేపథ్యంలో తమ లేఖను పరిశీలించి ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు.