డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సీఎంగా పనిచేసిన వ్యక్తి.. ఒక్క ఓటమితో అసెంబ్లీలో కూర్చోకుండా వెళ్లిపోయారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమి.. మనిషిని అలా భయపెడుతుందని, దీనితో పోల్చితే జనసేన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. మనలాగే దెబ్బలు తింటే కనీసం 15 రోజులు కూడా పార్టీ నడిపేవారా అనిపిచిందన్నారు.మంగళగిరిలో సోమవారం పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సత్కరించారు. వైసీపీ సహా ఏ పార్టీ వారైనా ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు కాదన్నారు. కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచిదికాదన్నారు. జన బలం ఉండి, ఒక్క సీటు గెలుచుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం 100 శాతం గెలిచామన్నారు.175 సీట్లతో పోల్చితే 21 సీట్లు పెద్ద సంఖ్య కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి 164 సీట్లు గెలవడానికి, మనం తీసుకున్న 21 సీట్లు వెన్నుముకగా నిలిచాయన్నారు. బాధ్యతలు మోసే ప్రతీ ఒక్కరికీ తాను అండగా ఉంటానని పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు.అప్పటి పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో బంధించి మరీ గుంటూరు తీసు కొచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కస్టడీలో ఆయనను కొట్టిన తీరు దారుణమన్నారు. అంతేకాదు నాలుగు దశాబ్దాలుగా పని చేసిన ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబును జైలులో పెట్టించారన్నారు.ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మందికి వెన్నుదన్నుగా జనసేన నిలిచిందన్నారు. రోడ్ల మీదకు రావాలంటే ఒకప్పుడు భయపడేవాళ్లమని, ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నూరి పోశామన్నారు. బాధ్యతలు మోసే ప్రతీ ఒక్కరికీ తాను అండగా ఉంటానన్నారు. పనిలోపనిగా కార్యకర్తలను సున్నితంగా హెచ్చరించారు జనసేనాని. మనకు సంస్కారం కావాలని, రౌడీయిజంతో భయపెట్టాలని చూస్తే వదులుకునేందుకు సిద్ధమన్నారు జనసేనాని. నా మాటలను మంచి మనసుతో అర్థం చేసుకోవాలన్నారు. మహిళా నేతలను సోషల్‌మీడియాలో కించపరిచినా యాక్షన్ తప్పదన్నారు.
మచ్చలేకుండా పని చేద్దాం – నాదెండ్ల మనోహర్
పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో అధినేత పవన్ కల్యాణ్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం.. మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలన్నారు.. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బంది.. మచ్చ రాకుండా అందరూ పని చేయాలని సూచించారు.. పదవులు మనకొచ్చాయి.. కానీ, మనకోసం పని చేసిన జనసైనికులు, వీర మహిళలను మరువద్దు అన్నారు.