అక్రమాలు చూడ్డానికా..
అక్రమార్కులను ఎన్నుకోడానికేనా..!
ఎన్నికల్లో జరిగిన
అక్రమాలపై చర్యలు..
ఇది విని..జరిగి..చూసి..
వీటి గురించి రాసి
చాలాకాలం అయింది.
దేశం సంగతి పక్కన బెడితే
మన రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు అంత పకడ్బందీగా జరగలేదనే చెప్పాలి.
ప్రచారంలో అనేక ప్రాంతాల్లో కోడ్ ఉల్లంఘన విచ్చలవిడిగా జరిగింది.డబ్బుల పంపిణీ యధేచ్చగా సాగింది.పెద్ద నాయకులు అనుకునే వారే ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి.ఓటు మాత్రం
మా పార్టీకే వెయ్యండి అంటూ పబ్లిగ్గా..నిస్సిగ్గుగా ప్రబోధం చేసిన సందర్భాలు చూసాం,.విన్నాం..!
అలాగే నగదును ప్రధాన పక్షాల అభ్యర్థులు పరస్పర అవగాహన మేరకు పంచిపెట్టడం ఎన్నికలు @2024 లోనే
మొదటిసారి జరిగింది.
డబ్బులు పంచిపెట్టడంలో తేడాలు జరిగి ఏకంగా
ఒక అభ్యర్థి ఇంటి మీద ఓటర్లు దాడి చేసినంత
పని చేశారు.
ఆ అభ్యర్థి ఇంటికి తాళాలు పెట్టుకుని లోపల ఉండిపోయిన ఉదంతమే ఈసారి ఎన్నికల్లో
హేయమైన సంఘటన అనుకుంటే పోలింగుకి రాకుండా ఓటును వ్యర్థం చేసిన జనం నుంచి అంతకు ముందు పంచిన డబ్బులు లాక్కోవడం మరీ చిత్రమైన ఉదంతం.ఓటు అనేది
ఎంత చీపు వస్తువుగా మారిపోయిందో
ఈ సంఘటనలు రెండూ కట్టెదుట దిగంబరంగా ఆవిష్కరించాయి.ఈ రెండు ఉదంతాలు ఒకే ఊళ్ళో..ఒకే అభ్యర్థికి సంబంధించినవి కావడం మరీ చిత్రం.
నిజానికి మన ఎన్నికల విధానం పకడ్బందీగా రూపొందించినదే.ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా నియంత్రించే నిబంధనలు అన్నీ అందులో ఉన్నాయి.అయితే వాటి అమలే లోపభూయిష్టం.
మొదటిసారి టి ఎన్ శేషన్
కాస్త పకడ్బందీగా అమలు చేసినప్పుడు దేశం మొత్తం ఆహా అంటే ఆయనే స్వయంగా “నేను కొత్తగా చేస్తున్నది ఏమీ లేదు..
ఉన్న నిబంధనలను అమలు చేస్తున్నానంతే” అని చెప్పారు.
శేషన్ తర్వాత మళ్లీ
ఆ నిబంధనలు సక్రమంగా అమలయ్యిందే లేదు.
నామినేషన్ల దాఖలు నుంచి
పోలింగ్..కౌంటింగ్ వరకు
అన్నీ లోపభూయిష్టంగానే జరుగుతున్నాయి.వేల కోట్లు వెనకేసుకున్న నాయకులు
తమ ఆస్తుల లెక్కలను
ఎంత తక్కువగా చూపినా..
పది కార్లు ఉన్నవారు అసలు కారే లేదని చెప్పినా అభ్యంతరం ఉండదు.
ఫోను కూడా లేదని
ఒక గొప్ప..ప్రముఖ అభ్యర్థి అఫిడవిట్ దాఖలు చేసినా
ఎన్నికల అధికారులు మౌనంగా నమోదు చేసుకోవడం మన దేశంలో మాత్రమే జరిగే పెద్ద వింత.
ఎంత పెద్ద ఆరోపణలు..
ఎంతటి తీవ్రమైన కేసులు
ఉన్నా ఎన్నికల్లో పోటీ చెయ్యడం..గెలవడం..గెలిచి ముఖ్యమంత్రి అంతటి పెద్ద పదవిని చేపట్టి ఏలడం.. అత్యంత హేయమైన వ్యవహారంగా పరిణమించింది.
ఇక ఎన్నికల అక్రమాలు..
తప్పుడు పనులు..
హింస..నానాటికీ పెరిగిపోతున్నా అదుపు ఉండదు.ఈ ఎన్నికల్లో పరాకాష్ట అనడానికి లేదు.
వచ్చే ఎన్నికల నాటికి ఇంకా పెరుగుతాయి.వినడానికి..
చూడ్డానికే సిగ్గేస్తుంది.
ఛీ..!
ఇక వర్తమానంలోకి వస్తే..
ఈ ఎన్నికల్లో ఏకంగా
ఈవిఎంను ఎత్తి పడేసిన ఉదంతం కూడా చూసాం. హౌస్ అరెస్టులో ఉన్న వ్యక్తి ప్రెస్ లో కనిపించినా..ఎంతటి ఘాతుకానికి పాల్పడినా
తక్షణ చర్యలు ఉండవు.
తటపటాయింపులు..
మీనమేషాలు..లాలూచీలు..
పోలీసులే రక్షణ కల్పిస్తున్నారని ఆరోపణలు.
ఇవన్నీ చూస్తుంటే..
ప్రజాస్వామ్యంపై
నమ్మకం సన్నగిల్లదా..
వ్యవస్థపై విరక్తి పుట్టదా..
రాజకీయమంటే
రోత కలగదా..
అసలు ఎన్నికలంటేనే అసహ్యం అనిపించదా..
పార్టీలన్నీ ఒకే లాంటి వ్యక్తుల్ని బరిలోకి దింపుతున్నప్పుడు
ఎంతో పవిత్రమైనది అనుకున్న ఓటును ఎవరో
ఒక హీనచరితుడికి వెయ్యడం..అతగాడు మనల్ని పాలించడం ఏమిటని అనిపించదా..!
ఎందుకు ఈ ఎన్నికలు..
దుర్మార్గులను..
నేరచరితులనూ
ఎన్నుకోడానికా..
అవసరమా మనకి..??
✍️✍️✍️✍️✍️✍️✍️
సురేష్ కుమార్ ఎలిశెట్టి
జర్నలిస్ట్
9948546286