వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్నిపరామర్శించిన జగన్
అనంతరం ప్రెస్ మీట్
ఈ నెల 24న ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ చేపడతామని వెల్లడి
రాష్ట్రపతి, ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తానని వివరణ
వినుకొండ:-రాష్ట్రంలో ప్రజలకు పథకాలు అమలు చేయని చంద్రబాబు, వీటన్నింటి నుంచి దృష్టి మరల్చేందుకు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే కార్యక్రమాలకు తెరలేపారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. చంద్రబాబు ఈ మాదిరిగా దాడులు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. “కచ్చితంగా వీటిపై నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో తప్పకుండా అడ్డుతగులుతాం. రాష్ట్రంలో శాంతిభద్రతలపై గవర్నర్ ను నిలదీస్తూ, వైసీపీ గళం విప్పుతుంది. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఢిల్లీ వెళ్లి బుధవారం (జులై 24) నాడు సింబాలిక్ ప్రొటెస్ట్ చేపడతారు.
ఏపీలో జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి దేశమంతా తెలిసేలా ఈ నిరసన కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగానే, ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ అడిగాం. అమిత్ షా, రాష్ట్రపతి అపా యింట్ మెంట్ కూడా తీసుకుంటాం. వీళ్లందరినీ కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై వివరిస్తాం. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళతాం” అని జగన్ స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సానుభూతిపరులను ఇలాగే చంపుతామని
సందేశం పంపినట్టుంది: వినుకొండలో జగన్
వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అటవిక పాలన కొనసాగుతోందని అన్నారు. గత 45 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఏ సామాన్యుడ్ని అడిగినా ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే చెబుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ వాళ్లయితే చాలు… వారు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరి ఆస్తులైనా ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరిపైనైనా హత్యాయత్నం చేయొచ్చు, వారు ఏం చేసినా పోలీసులు క్షకపాత్ర పోషిస్తారు, బాధితులపైనే కేసులు పెడతారు అనే నీచ సంస్కృతి ఇవాళ రాష్ట్రంలో రాజ్యమేలుతోందని జగన్ వ్యాఖ్యానించారు. “చంద్రబాబు నాయుడి గారిని ఒకే ఒక్కటి అడుగుతున్నా. ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ వాళ్ల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లలో చొరబడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, షాపులు కాల్చివేస్తున్నారు, వైసీపీ సానుభూతిపరుల చీనీ తోటలు నాశనం చేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవికాకుండా… 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇదీ. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని చెప్పడానికి వినుకొండలో రషీద్ హత్య ఘటనే ఉదాహరణ. ఇంతకుముందు ఇక్కడ రవిశంకర్ రెడ్డి అని మంచి ఎస్పీ ఉండేవాడు. కానీ ఎన్నికల వేళ వీళ్లకున్న పలుకుబడితో ఆయనను తప్పించేశారు. ఆ తర్వాత వీళ్లకు కావాల్సిన బిందు మాధవ్ అనే అధికారిని తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ ఎంతటి అన్యాయస్తుడు అంటే, ఎన్నికల సంఘమే స్వయంగా జోక్యం చేసుకుని అతడ్ని తప్పించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల సంఘమే మలికా గార్గ్ అనే మంచి ఆఫీసర్ ను తీసుకువచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ ను కూడా పంపించివేశాడు. ఆ తర్వాత వీళ్లకు కావాల్సిన శ్రీనివాస్ అనే ఎస్పీని తెచ్చుకున్నారు. ఆ ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఈ హత్య జరిగింది. అత్యంత దారుణంగా, నడిరోడ్డుపై, అమాయకుడైన వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపడం ప్రజలందరూ చూశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సానుభూతిపరులను ఇలాగే చంపుతామని సందేశం పంపినట్టుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కూడా పత్రికల ముసుగులో దిగజారిపోయాయి. హత్య చేసిన జిలానీ బైక్ ను గతంలో వైసీపీ వాళ్లు కాల్చేశారట… అందుకే ఈ హత్య జరిగిందని ఈనాడులో దిక్కుమాలిన అబద్ధం రాశారు. నిజంగా ఇవి పేపర్లా, టీవీ చానళ్లేనా? సిగ్గుతో తలదించుకోవాలి. వాస్తవానికి ఆ బైక్ ఆసిఫ్ అనే వైసీపీ మద్దతుదారుడింది. అప్పట్లో తన బైక్ తగలబెట్టారంటూ ఆసిఫ్ టీడీపీ నేతలపై కేసు పెట్టాడు. జరిగిన ఇన్సిడెంట్ ఇదీ. అది కూడా ఈ ఏడాది జనవరి 17న ఆ ఘటన జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగిందని పోలీసులు కూడా సహకారం అందిస్తున్నారు” అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.