Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుశాంతిభద్రతలు కాపాడాల్సిన దశలో సీఎం విదేశీ పర్యటనకు వెళ్లడమా?: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

శాంతిభద్రతలు కాపాడాల్సిన దశలో సీఎం విదేశీ పర్యటనకు వెళ్లడమా?: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఏపీలో పోలింగ్ అనంతరం తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, రెండ్రోజుల కిందట సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడంపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు.
“ఏపీలో ఎన్నికలు ముగియగానే అనేక సంఘటనలు చోటుచేసున్నాయి. నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి… ఇలా అనేక ప్రాంతాల్లో పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం గర్హనీయం. ప్రతి ఒక్కరూ వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇవ్వడం తప్ప… ఇలాంటి సంఘటనల్లో పాలుపంచుకోవద్దని ఏ పార్టీ అయినా వారి క్యాడర్ కు చెప్పిందా? ఇంతవరకు ఏ పార్టీ అయినా ఎవర్నయినా సస్పెండ్ చేశారా? ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ యాత్రలకు వెళ్లారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం అంటే ఎన్నికలను నడిపిస్తుంది కానీ, శాంతిభద్రతలు నడిపించాల్సింది ముఖ్యమంత్రి, వారి మంత్రివర్గం. 144 సెక్షన్ పేరు కాగితంపై ఉందే తప్ప, దాన్ని సక్రమంగా ఎక్కడా అమలు చేయడంలేదు. మొన్న పోలింగ్ రోజున కూడా గుంపులు గుంపులుగా వచ్చి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. అలాంటి వారిపై పెద్దగా చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా కనిపించలేదు. సిట్ కూడా త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, ఈసీకి త్వరగా నివేదిక అందించాలి. ఏ పార్టీకి చెందిన వారైనా బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే రాష్ట్రంలో చట్టం పనిచేస్తోందన్న నమ్మకం కలుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమేనన్న స్పష్టమైన సందేశం వెళ్లాలి” అని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article