కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన తాజా వ్యాఖ్యలు భారతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్‌లో ఇటీవల రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనలను ప్రస్తావిస్తూ, సల్మాన్ ఖుర్షీద్ భారత్‌లో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు.ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, “భారతదేశంలో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా, బంగ్లాదేశ్ తరహా హింసాత్మక, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగే అవకాశం ఉంది,” అని హెచ్చరించారు. ఖుర్షీద్ కశ్మీర్ పరిస్థితులను ప్రస్తావిస్తూ, అక్కడ కూడా అంతా బాగానే ఉందనిపిస్తున్నా, క్షేత్ర స్థాయిలో వేరే పరిస్థితులు దాగి ఉన్నాయని అభిప్రాయపడ్డారు.అలాగే, సీఏఏ-ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్ బాగ్‌లో జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని గుర్తు చేశారు. మహిళలు నాయకత్వం వహించిన ఈ నిరసనలు సుమారు 100 రోజుల పాటు కొనసాగాయి, కానీ ఇందులో పాల్గొన్న చాలా మంది ఇప్పటికీ జైలులో ఉన్నందున, ఖుర్షీద్ దీన్ని విఫలమైన ఆందోళనగా పేర్కొన్నారు.సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల ఆందోళనను వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశాన్ని సూచిస్తున్నాయి.

