• ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదు
• అమరావతి రైతులు, మహిళలు, ఇతర ప్రజలు నిరూపించిందిదే
• రాజధాని లేని రాష్ర్టం తల లేని మొండెం లాంటిది
• రాజధాని ఒక్కటే ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి
• అసమానతలు తొలగించుకుని సమైక్యంగా సాగాలి
• భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టీకరణ
విజయవాడ: అమరావాతి ఉద్యమం గొప్ప జీవిత పాఠమని భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. అమరావతి రైతులు, మహిళలు, ఇతర వర్గాల ప్రజల త్యాగం స్ఫూర్తిదాయకమని చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ ఛాప్టర్, ఆత్కూర్ లో స్వయం ఉపాధి శిక్షణ పూర్తి చేసుకున్న యవతీయువకులకు గురువారం శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ధ్రువీకరణ పత్రాలు అందజేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు 1631 రోజుల పాటు శాంతియుతంగా ఉద్యమం చేయడం గొప్పవిషయం. స్వాతంత్ర్యోద్యమం తర్వాత అంత గొప్పగా, శాంతియుతంగా జరిగిన ఉద్యమం ఇది. అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులెదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో చరిత్రాత్మక ఉద్యమాన్ని నిర్వహించారు. చివరకు ప్రజల కోరిక నెరవేరడం సంతోషం. అమరావతే రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత వారు ఉద్యమ దీక్షను ఉపసంహరించుకోవడం అందరూ సంతోషించదగ్గ విషయం. 33వేల ఎకరాలు రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇవ్వడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. వాళ్లు ఇష్టపడి ఇచ్చారు, తర్వాత కష్టం వచ్చింది. ఇష్టంతోనే ఆ కష్టాన్ని ఎదుర్కొన్నారు. దీంతో వారు నష్టపడలేదు. ఇప్పుడు మేలు జరిగింది. జీవితంలో మనమందరం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ’’ అని చెప్పారు.
రాజధాని లేని రాష్ర్టం తలలేని మొండెం వంటిదని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారు మాటిచ్చినట్లు రాష్ర్టంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వసిద్దాం. నేను గతంలో కూడా చెప్పాను.. రాజధాని ఒకటే ఉండాలి, ఒక చోటే ఉండాలి. చట్టసభ, పాలన వ్యవస్థ వంటివన్నీ ఒక చోట ఉంటేనే సమన్వయంతో కలిసి పని చేయడానికి వీలవుతుంది. అభివృద్ధిని వికేంద్రీకరించాలి, రాజధానిని మాత్రం కేంద్రీకరించాలి. అన్నింటికీ కేంద్రంగా రాజధాని ఉండాలి. జిల్లాలతో రాజధాని అనుసంధానం జరగాలి. ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. ప్రాంతీయ అసమానతలుండకూడదు. సమతుల్యం పాటించాలి. అసమానతలుంటే వాటిని తొలగించుకుని సమైక్యంగా ముందుకెళ్లాలి.’’ అని స్పష్టం చేశారు.
యువతరం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా శ్రీ వెంకయ్యనాయుడు చెప్పారు. ‘‘జీవితంలో స్థిరపడిన తర్వాత యువత రాజకీయాల్లోకి రావాలి. యువతలో నిజాయతీ ఉంటుంది. వారొస్తే రాజకీయాలు బాగుపడతాయి. రాజకీయాలంటే ఈసడించుకునే పరిస్థితిని కొంత మంది నేతలు తీసుకొచ్చారు. బూతులు మాట్లాడేవారికి పోలింగ్ బూత్ లలో సమాధానం చెప్పాలని నేనే గతంలో అనేక వేదికల్లో చెప్పాను. ఇటీవల ఎన్నికల ఫలితాల్లో అందరూ ఈ విషయాన్ని గమనించినట్లున్నారు. అవినీతికి పాల్పడేవారికి, శాసనసభల్లో ఇష్టానుసారం వ్యవహరించేవారికి, అరాచకాలకు పాల్పడేవారికి ప్రజలు అవకాశం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారు. ఈ విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలి. ’’ అని అన్నారు.
రామోజీ గారి నుంచి ఎంతో నేర్చుకున్నా
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ రామోజీ రావుగారి నుంచి తానెంతో నేర్చుకున్నానని శ్రీ వెంకయ్యనాయుడు చెప్పారు. ‘‘చరిత్ర తెలుసుకోవాలి, మహనీయుల గురించి తెలుసుకోవాలి, వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ప్రతిభాశీలి, స్వయం కృషితో పైకొచ్చి, వేల మందికి ఉద్యోగాలిచ్చిన గొప్ప వ్యాపారవేత్త, దేశమంతా గర్వించే స్థాయిలో ఫిలింసిటీని ఏర్పాటు చేసిన శ్రీ రామోజీరావుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన చాలా రంగాల్లో అపూర్వ విజయాలు సాధించారు. ఏ విషయాన్ని అయినా ఆయన సునిశితంగా అధ్యయనం చేసేవారు. వారితో ఎన్నో సందర్భాల్లో మాట్లాడాను. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. యువతరం శ్రీ రామోజీ గారి గురించి తెలుసుకుని వారి జీవితం నుంచి స్ఫూర్తిని పొందాలి.’’ అని సూచించారు. ఈ సందర్భంగా అందరూ లేచి నిలబడి శ్రీ రామోజీ రావుగారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు.
ఈ సందర్భంగా శ్రీ వెంకయ్యనాయుడు యువతకు విలువైన సూచనలు చేశారు. జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన పాటించడం చాలా అవసరమని చెప్పారు. చదువులో రాణించడంతో పాటు ఏదో ఒక భారతీయ కళలోనో, క్రీడలోనో ప్రావీణ్యం సంపాదించాలని, దీనివల్ల గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఇటీవల కాలంలో రోడ్లు , చెరువులు ఆక్రమించేస్తున్నారని, ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ చరిత్రను, రాష్ర్ట చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతితో కలిసి జీవించాలని, అందరితో కలిసి మెలిసి ఉండాలని, మనకున్నదానికి నలుగురితో పంచుకోవాలని, పెద్దలను గౌరవించాలని సూచించారు. ఉన్నదానిని నలుగురితో పంచుకోవాలన్నది భారతీయ సనాతన ధర్మమని, స్వర్ణభారత్ ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్ చేస్తున్నదదేనని చెప్పారు. ఎన్నో ఉపయుక్తమైన, సమాజంలో డిమాండ్ ఉన్న కోర్సులు, పూర్తి చేయగానే ఉపాధి దొరికే కోర్సులు అందిస్తున్నారని, ఫలితంగా మహిళలకు ఆర్థిక స్వావలంబనతో గౌరవం పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.