చంద్రగిరి:
చంద్రగిరిలోని భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లోని ఆరోగ్య పరిశోధన విభాగానికి చెందిన ఆదర్శ గ్రామీణ ఆరోగ్య పరిశోధన విభాగం (మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ – ఎం.ఆర్.హెచ్.ఆర్.యు), ఆంధ్రప్రదేశ్ మరియు తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాల లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో, తిరుపతిలోని శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నందు బీఎస్సీ (నర్సింగ్) ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు “అంటువ్యాధులు కాని వ్యాధుల (ఎన్ సి డి)” పరీక్ష (స్క్రీనింగ్) పద్ధతుల గురించి ఒక శిక్షణా కార్యక్రమం ఎం.ఆర్.హెచ్.ఆర్.యు లో నిర్వహింపబడుతున్నది. ఈ శిక్షణలో భాగంగా మధుమేహం, అధిక రక్తపోటు, నోరు-ఊపిరితిత్తులు- రొమ్ము-గర్భాశయ వంటి వాటికి వచ్చే క్యాన్సర్ ల గురించి సవివరంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.ఏ. చంద్రశేఖరన్ పాల్గొన్నారు. ఆయన విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిశోధనల ఆవశ్యకతను తెలుసుకుని, తమ శక్తియుక్తులను, ప్రతిభను గ్రామీణ ప్రజలకు ఉపయోగప డే విధంగా ఆరోగ్య పరిశోధనలు చేయడానికి ఎం.ఆర్.హెచ్.ఆర్.యు ఒక మంచి వేదిక అవుతుందని, ఈ సదవకాశాన్ని వినియోగించుకుని వారు తమ పరిశోధనాత్మక విధానాలను మెరుగుపర్చుకోవాలని ఉద్ఘాటించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. వేంకటేశ్వరులు మాట్లాడుతూ అంటువ్యాధులు కాని వ్యాధుల ముందస్తు పరీక్షల ఆవశ్యకత గురించి సవివరంగా తెలిపారు. శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాల లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి, వైస్ ప్రిన్సిపాల్ మరియు ఎం.ఆర్.హెచ్.ఆర్.యు. నోడల్ ఆఫీసర్ డా. ఎస్. సునీత మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని జరిపేవిధంగా సూచించిన ప్రిన్సిపాల్ డా. పి.ఏ. చంద్రశేఖరన్ కు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. మరియు ఆయన సూచించిన బాటలో, ఇతోధిక ప్రోత్సాహంతో ఎం.ఆర్.హెచ్.ఆర్.యు మరెన్నో మంచి కార్యక్రమాలు, పరిశోధనలు చేపడుతుందని అన్నారు. శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం విభాగాధిపతి వి.ఎఫ్. ఆశాలత మాట్లాడుతూ విద్యార్థినులను ఆరోగ్య పరిశోధనల వైపు నడిపించేందుకు ప్రోత్సాహకంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాల మరియు ఎం.ఆర్.హెచ్.ఆర్.యు. లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షకులుగా శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాల కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.శివకళ మరియు డిప్యూటీ సివిల్ సర్జన్ డా. రామాంజనేయులు; ఎం.ఆర్.హెచ్.ఆర్.యు. చంద్రగిరి శాస్త్రవేత్త డా. జి. వెన్నెల సాహితి వ్యవహరించి విద్యార్థినులకు అంటువ్యాధులు కాని వ్యాధుల నివారణ, తీవ్రత, ప్రమాద కారకాలు, స్క్రీనింగ్ పద్ధతులు, రోగ నిర్ధారణ మరియు తీసుకోవాల్సిన పోషకాహారం తదితరాల గురించి సోదాహరణంగా వివరిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో (ఫీల్డ్) శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాల, శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అధ్యాపక బృందం మరియు ఎం.ఆర్.హెచ్.ఆర్.యు. సిబ్బంది పాల్గొన్నారు.