Sunday, September 14, 2025

Creating liberating content

టాప్ న్యూస్జర్నలిజంలో దొంగలు పడ్డారు

జర్నలిజంలో దొంగలు పడ్డారు

        జర్నలిజానికి ప్రజా స్వామ్య ప్రభుత్వం లో నాలుగవ స్థంభంగా పేరుంది.భారతదేశ మీడియా రంగం ఆరంభం నుండి దేశానికి స్వాతంత్య్రం సిద్దించిన అర్ధ శతాబ్దం పైగా మీడియా రంగం కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలు, విలువలతో పని చేసింది. సరిగ్గా నాకు తెలిసి 10 సంవత్సరాల నుండి మీడియా రంగం విలు వలకు తిలోధకాలు ఇస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనుగడ సాగిస్తుంది. అయితే ఇక్కడ పవిత్రమైన జర్నలిజాన్ని నేను తప్పు పట్టడంలేదు.ఈ పవిత్రమైన జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని మీడియా రంగం లో అడుగుపెట్టి/పెడుతున్న కొన్ని మీడియా సంస్థలు ఈ రంగాన్ని మంచి వ్యాపారసంస్థగా గుర్తించి లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి.దీనికి కారణం ఏదైనా ఒక పేపర్/ టీవీ ఛానల్ ప్రారంభించే వారు మొదట ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం, ప్రజా సమస్యలపై పోరాటం ఆంటూ ప్రతి పేపర్ కు/ప్రతి ఛానల్ కి సమాజాన్ని ఉద్దరించే విధంగా ట్యాగ్ లైన్ ఏర్పాటు చేసుకుని ఆర్.ఎన్.ఐ సర్టిఫికేట్ పొంది ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి కొన్నాళ్లు గడిచాక స్వలాభం కోసం పనిచేస్తున్నాయి.మీడియా రంగంలో ఉన్న అన్ని పేపర్స్, టీవీ ఛానల్స్ గురించి ఇక్కడ చెప్పడం లేదు.2005వ సంవత్సరం తరువాత పురుడు పోసుకున్న కొన్ని పేపర్స్/ టీవీ ఛానల్స్ రావడం, రావడంతోనే జర్నలిజంలో ఓనమాలు కూడా తెలియ ని కొందరు వ్యక్తులను ఏ ప్రమాణాలు పాటించ కుండా ఇబ్బడి ముబ్బడిగా తమ పత్రికకు/ఛానల్ కి ఒక్కో ఏరియాకు ఒక్కో ప్రతినిధిని నియమించి మీ ఇంట్లో తిని మా ఇంట్లో పని చేయండి అన్న చందంగా మనుగడ సాగిస్తున్నాయి. జర్నలిస్ట్ అని ఒక హోదా కల్పిస్తూ తమ పేపర్/ ఛానల్ కి నియమించిన ప్రతినిధులకు కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా ప్రకటనలు తీసుకురండి ఆ ప్రకటనల్లో కమీషన్ జీతాల రూపంలో తీసుకోండి అని ప్రజాక్షేత్రం లో వదిలేస్తే ఆయా జర్నలిస్ట్ లు తాము పనిచేస్తున్న మీడియా సంస్థలకు ఎంతని దోచి పెట్టాలి.ఎన్నాళ్లు ఆ కమీషన్ల పై జర్నలిస్ట్ లు జీవనం సాగించాలి. ముందుగా చెప్పినట్లు ఇక్కడ అన్ని మీడియా సంస్ధలు గురించి చెప్పడం లేదు.5 ఏళ్ళ క్రితం పుట్టుకొచ్చిన మీడియా సంస్థలు కొన్ని తన మీడియా సంస్థ స్థానం ఏమిటి...? అని కూడా ఆలోచన లేకుండా కొన్ని మీడియా సంస్థలు ఇలా వ్యాపార ప్రకటనల కోసం జర్నలిస్ట్ లను ఏజెంట్లుగా పెట్టి ఒకొక్కరికి లక్షలు, లక్షలు టార్గెట్స్ విధించే వాటి గురించే ఇక్కడ మన ప్రస్తావన.అలాగే ఏ వ్యాపార సంస్థ అయినా/ఏ పారిశ్రామిక సంస్థ అయినా/ఏ విద్యా సంస్థ ఆయినా అనుకూలంగా లేని ఏ వ్యవహారాలనైన అందిపుచ్చుకుని క్యాష్ చేసుకోవడానికి అడిగిన వెంటనే ప్రకటన ఇవ్వక పోతే ఆ ఆ సంస్థల బొక్క లు వెతికి దాని పై ఒక వార్తా కధనం వేస్తే వాడే దారికి వస్తాడని జర్నలిస్ట్ లను ఉసిగొల్పి,ఒకవేళ జర్నలిస్ట్ లు తమ మీడియా సంస్థ చెప్పినట్లు చేయకపోతే వృత్తి నుండి పీకేస్తామని భయపెట్టి జర్నలిస్ట్ లను పావులు గా వాడుకునే కొన్ని మీడియా సంస్ధలు ప్రస్తుతం మీడియా రంగంలో చెలామణీ ఆవు తున్నాయి.ఈ విధానం కాదా ..జర్నలిజంలో దొంగలు పడ్డారు అనే పదానికి అర్ధం.ఈ విధానాన్ని ఎవరైనా కాదనగలరా....?లేదు ఇది తప్పు అని ఎవరైనా చెప్పగలరా ...?కావాలి అంటే లక్షలు,లక్షలు టార్గెట్స్ రీచ్ అయ్యేందుకు మా జర్నలిస్ట్ సోదరులు పడుతున్న అవస్థలు, జర్నలిస్ట్ వృత్తి లో కొనసాగేందుకు మీడియా సంస్థలు చెప్పినట్లు చేయకపోతే వృత్తి నుండి నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్న తీరు ఆ సమస్యలు ఎదుర్కొన్న జర్నలిస్ట్ లకు బాగా తెలుసు.ఇలా మీడియా సంస్థల నుండి పీడించబడుతూ,తప్పక జర్నలిస్ట్ లుగా కొనసాగు తున్న వారిని కదిలించి చూడండి.మీడియా సంస్థలు విధించే ప్రకటనల  టార్గెట్స్ విషయానికి వస్తే వాళ్ళ అమ్మ,బాబులు సంపాదించిన సొమ్ములు వారివే అన్నట్లు ఆయా సంస్థల వద్ద కట్టలు-కట్టలు, గోతాలు-గోతాలు వీరు  కూడబెట్టినట్లు ఆడిగిందే తడవుగా వీరికి వేలకు- వేలు,లక్షల-లక్షలు ప్రకటనల కుమ్మరించేయాలి అన్నట్లు ఉంది కొన్ని మీడియా సంస్థల తీరు.మీడియా ముసుగులో ప్రకటనలు ఈజీగా వచ్చేస్తాయి అన్నట్లు జర్నలిస్ట్ లను ఎజెంట్స్ గా పెట్టి వసూళ్ళ పర్వం కొనసాగిస్తున్నారు. ఇక్కడ మరో మాట నిజం గా సామాజిక బాధ్యత వహిస్తూ పనిచేసే మీడియాకి ఆర్ధిక సహ కారం అందించే దిశగా ఆ మీడియా సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రకటనలు చాలా అవసరం. ఇలా ప్రోత్సాహం కల్పించే వ్యవస్థలనుండి న్యాయంగా  ప్రకటనలు తీసుకోవడం ఓ రకంగా మీడియాకి ఆరోగ్యకరంగా ఉంటుంది.అంతే గానీ కులానికో పేపర్ /మతానికో ఛానల్ పెట్టుకుని ఎవరిని ఉద్ధరించడానికి వచ్చాయో కూడా తెలియని పరిస్థి తుల్లో ఉన్న కొన్ని మీడియా సంస్థలు ప్రకటనల కోసం పాకులాడుతున్నాయి.ఇక జర్నలిస్ట్ లు ప్రకటనల టార్గెట్స్  రీచ్ అవ్వక పోతే జర్నలిజం వృత్తి నుండి పీకేయడం నువ్వు చేయ లేక పోతే ఇక సెలవు తీసుకో టార్గెట్స్ చేస్తామని వచ్చే వారు ఎందరో ఉన్నారు అని ఖరాఖండిగా హెచ్చరిస్తూ నిమిషాల వ్యవధిలో వేరే వారిని నియామకం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుత మీడి యారంగంలో బాగా ఉన్నా యి.ఇలా వృత్తి నుండి పీకి వేయబడిన జర్నలిస్ట్ లు చేయలేని టార్గెట్స్ కొత్తగా నియామకం చేసుకున్న వారు వచ్చి పొడిచేది,పీకేది ఎమీలేదు.కానీ మీడియా సంస్థల భరోసా ఏమిటో...! తెలియదు కానీ ముందు పని చేసిన వారు టార్గెట్స్ చేయలేదని పీకివేసి టార్గెట్స్ చేసే వారు వస్తార ని కొత్త వాళ్ళను నియామ కం చేసుకొని వారు చేయ లేదని మరొకరిని నియామ కం చేస్తు అలా ఎవరో వస్తారు...ఏదో చేస్తారు అని  చివరికి తమ మీడియా సంస్థకు దోచిపెట్టె దొంగ నాయాళ్ళు దొరికే వరకు ముందు వారిని పీకేయడం, కొత్తగా వచ్చే దొంగ జర్నలిస్ట్ లను నియామకం చేయడం అనే పరంపర అడ్డూ-అదు పు లేకుండా నిర్విరామంగా కొన్ని మీడియా సంస్థల్లో  కొనసాగుతూనే ఉంది.ఇది కాదా... జర్నలిజంలో దొంగలు పడ్డారు అనే దానికీ నిలువెత్తు సాక్ష్యం. లేదంటే మీడియా సంస్ధలు జర్నలిస్ట్ లను తమ పత్రి కలకు/టీవీ ఛానల్స్ కి జర్నలిస్ట్ లను నియామకం చేసే విధానం లో ఉన్న శ్రద్ధ అలా నియామకం చేసిన జర్నలిస్ట్ కి ఉద్యోగ భద్రత కల్పిస్తుందా...?కనీస గౌరవ వేతనం ఇస్తుందా. ..?ఒక ఐడీ కార్డు ఇవ్వాలనే ఇంగితజ్ఞానం కలిగి ఉందా ...?కార్మిక,వేతన చట్టాలు అమలు చేస్తు న్నాయా....?ఇవన్నీ మీడియా ఆడుతున్న దొంగాటలు కాదా...?వైట్ కాలర్ దోపిడీ కాదా...?ఇలా వ్యవహరించే మీడియా సంస్థల వ్యవహారాన్ని ఏ ప్రభుత్వాలైనా...? కనీస రక్షణా చర్యలు చేప ట్టాయా....?చేపట్టవు...!ఎందుకంటే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేది స్వప్ర యోజనాలకు,అక్రమ ఆర్జనకేగా...!అలా వచ్చిన ప్రభుత్వాలు ఏకంగా మీడియా సంస్థల సహ కారంతోనేగా...?ప్రజలకు వరాల జల్లు కురిపించి, వాటిని అమలు చేసినా- చేయక పోయినా కొద్దిపాటి పప్పు-బెల్లాలు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవ డానికి రాజకీయ నాయ కులు మీడియా సంస్థలకు స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చి విస్తృత ప్రచారం పొందు తున్న వ్యవహారం ప్రజలకు తెలియంది కాదు.కాకపోతే పార్టీకో పత్రిక-నాయకుడికో  ఛానల్ ఇలా మీడియా రంగాన్ని చేతుల్లోకి తీసుకుని సొంత డబ్బా కొట్టుకునే పాలకుల తీరు తో ఇప్పుడు మీడియా రంగం పూర్తిగా గాడి తప్పిపోయింది.

       ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు అనే వారు. కానీ ఇప్పుడు బ్రతక నేర్చిన వాడు జర్నలిస్ట్ అంటు న్నారు.కానీ ఒకప్పుడు బ్రతక లేక బడిపంతులు అయినా ఏ లాభం ఆర్జించక సమాజంలో అక్షర జ్ఞానం లేని వ్యక్తులను ఉన్నత స్థితికి చేర్చిన వారు ఆ బడి పంతుల్లే. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో సమా జంలో అల్లుకు పోయిన అవినీతి, అక్రమాలను, రాజకీయ నాయకుల అడ్డు-అదుపు లేని విధానాలను, లంచ గొండి అధికారుల తీరు వంటి అవినీతి-అక్రమాలను పరిశోధనాత్మక కథనాల రాతలతో ఎండగడుతూ చెడి పోయిన సమాజాన్ని తీర్చిదిద్దే0దుకు ఓ బడి పంతులు చేతిలో బెత్తంలా కలాన్ని ఉపయోగించి నాటి నేటి సమాజానికి దిశా నిర్దేశం చేసిన/చేస్తున్న మా అక్షర సైనికుల సిరాచుక్క ల సంగ్రామం ఎంతమంది అర్ధం చేసుకోగలరు. సింపు ల్ గా బ్రతకనేర్చిన వాడు జర్నలిస్ట్ అంటే సరి పోతుం దా...?అలా అని మాలో ఉన్న దొంగ అవినీతి, అక్ర మాలకు పాల్పడే జర్నలిస్ట్ లను నేను వెనకేసుకొస్తూ ఈ అంశం రాయటం లేదు. ప్రస్తుతం నీతి,నిజాయితీ లతో, విలువలతో జర్నలిజం వృత్తిలో పని చేసే వారు ఎందరో.... సర్వంకోల్పోయి,ఆరోగ్యాలు క్షీణించి చావలేక బ్రతకలేక జీవనం సాగి స్తున్న కలం వీరులు ఎందరో ఉన్నారు.ఇది గమనించి జర్నలిస్ట్ లు అందరిని దొంగలు,దోపిడీ దారులుగా ఒకే గాటన కట్టేయరాదని విలువలు కలిగిన జర్నలిస్ట్ లపై కూడా చులకన భావం కలిగిన వారికి మనవి. ప్రస్తుతం జర్నలిస్ట్ గా పని చేస్తున్న వారిని చూసి ప్రజలు అందరూ జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వారందరినీ దొంగలే అన్నట్లు చూస్తున్నారు. జనం జర్నలిస్ట్ లను అలా అనుకోవడంలో తప్పులేదు.కానీ మా జర్నలిస్ట్ లు ఎందుకు దొంగలు అవుతున్నారు. మీడియా సంస్థలు అవలం భిస్తున్న వ్యవహారం అని ఎందరు అర్ధం చేసుకో గలరు.ఇక్కడ ఓ ఉదాహరణ చెపుతా...!నేను జర్నలిజంలో కి వచ్చిన కొత్తలో గతంలో నాకు పరిచయం ఉన్న ఓ ముగ్గురు పెద్ద మనుషులు, నేను బాగా గౌరవించి, అభిమానించే వ్యక్తులు కొంతకాలం గ్యాప్ తరువాత ఒకరికొకరు ఎదురుపడ్డాం.మంచిగా పలకరించుకొని యోగ క్షేమాలు మాట్లాడు కుంటున్న సమయంలో ఏమయ్యా ...ఏం చేస్తున్నావు అని అడిగారు. దానికి నేను ఓ జర్నలిస్ట్ ని అనే హోదా..తో జర్నలిస్ట్ గా చేస్తున్నా అని చెప్పాను.దానికి వారు ముగ్గురు అబ్బా పర్వాలేదే...అన్నారు.అంతే  మరో వ్యక్తి కల్పించుకుని జీతం ఎంత...?అని ప్రశ్నించాడు. దానితో ఏదో చిన్నపాటి రెమ్యునరేషన్ ఇస్తారు అని చెప్పా.... వెంటనే మరో వ్యక్తి అందుకుని ఏముం దండీ...వాళ్ళ అవసరాన్ని బట్టి ఎవడో ఒకడు ఆవారాగాడిని పట్టుకుని గొప్పగా ఒక లోగా ఇస్తారు...ఇక ఊరి మీదకు వదిలి జర్నలిస్ట్ హోదాతో దోచుకోండి-మాకు దోచి పెట్టండి అని ఇక వీళ్ళని చూసి ప్రతివాడు భయపడి వారు ఇచ్చే డబ్బులే వీరికి సంపాదన అని చాలా తప్పు పడుతూ మాట్లాడారు.వారు మాట్లాడిన విధానానికి కొంత బాధపడినప్పటికి నాడు వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ వారు మాట్లాడింది అక్షర సత్యం అని మరి కొన్నేళ్లకు గానీ నాకు అర్ధం కాలేదు.ఇటువంటి వ్యవహారాల్లో మా జర్నలిస్ట్ లను ఓ సారి పరిశీలించి ఎవరు దొంగలు అనే ఓ నిర్ణయానికి ప్రజలు రావాలని నా మనవి. అయితే ఎంతో పవిత్రమైన వృత్తిలో ఉండి 24 గంటలు,360 రోజులు జర్నలిస్ట్ లు జర్నలిజం అనే వృత్తిలో కొనసాగుతూ నిజంగా వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఓ సారి పరిశీలన చేయండి. జర్నలిస్ట్ లు దొంగలు అనుకున్న వారికి 

ఇక్కడ ఒక్కటే చెప్పదలు చుకున్నా,ఇప్పుడు జర్నలిజం అనేది కొందరు అవినీతి పరులు, అక్ర మార్కులు,దోపిడీ గాళ్ళు, పలువురు నేరస్థులు, తప్పుడు- తారుపుడు గాళ్ళు,అక్రమ వ్యాపారులు వంటివారు ఎంతో మందికి ఒక షెల్టర్ జోన్ గా మారింది.జర్నలిజం ని అడ్డుపెట్టు కుని వారి వారి అవినీతి- అక్రమాలకు జర్నలిజాన్ని సేఫ్ జోన్ గా మార్చుకున్నారు వీళ్ళ వలనే జర్నలిజంలో దొంగలు పడ్డారు అనేదానికి సరైన నిర్వచనంగా చెప్పు కోవాలి.ఈ విధానమే అసలు సిసలైన మాట అదే జర్నలిజం లో దొంగలు పడ్డారు అంటే…!ఇటువంటి వారు జర్నలిజం లోకి రావడం వలనే విలువ లతో పనిచేసే జర్నలిస్ట్ లకు చెడ్డ పేరు వస్తుంది.ఈ విధా నాన్ని అరికట్టాలి అంటే మీడియా సంస్ధలు జర్నలిస్ట్ లను నియామకం చేసేటప్పుడు నియమ నిబంధనలను తప్పనిసరి గా పాటించాలి. మీడియా రంగాన్ని గాడితప్పిపోయే లా చేసిన కొన్ని మీడియా సంస్థలు జర్నలిజంలో దొంగలకు అవకాశం కల్పిస్తున్నాయి.విలువలు కలిగిన జర్నలిస్ట్ లను నియామకం చేసుకోవడం కన్నా,సామాజిక స్పృహ, సామాజిక భాద్యత లేని అవారాగాళ్లకు,పేరు ఊరు లేని గొట్టం గాళ్లకు ఓ డబ్బా లోగో ఇచ్చి జర్నలిస్ట్ అనే హోదా కల్పించి ప్రజాక్షేత్రం లో మనకు ఎదురులేదు ఆడిందే ఆట-పాడిందే పాట ఆంటూ క్యారెక్టర్ లేని వారిని జర్నలిస్ట్ లుగా నియమించుకోవడం వల్లనే సమస్య.కాబట్టి ఇక్కడ జర్నలిజం అర్హతలు విలువలను ఎవరు కూనీ చేస్తున్నారో ప్రజలు గమనించాలి.ఇక ఏ భయం-బెరుకు లేకుండా అవినీతి- అక్రమాలకు పాల్పడే వారిని తన స్వలాభం కోసం నియామకం చేసుకుంటున్న మీడియా సంస్థలదే ఇక్కడ నేరం.ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్ట్ లుగా వచ్చే వారి ప్రవర్తన తీరు, క్యారెక్టర్, విద్యార్హతలు వంటి వాటి పై ఏ మీడియా సంస్థలైనా… నియమ-నిబంధనలు పాటిస్తాయి అనుకోవడం మన అత్యాశ….!

పెట్టుబడిదారీ వ్యవస్థ గుప్పిట్లో జర్నలిజం

      భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ ఒకటి ఉంది. ఈ వ్యవస్థలో ఉన్న వారు దేశాన్ని, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను, మీడియాను పెద్ద ఎత్తున తమ గుప్పిట్లోకి తీసు కున్నారు.దేశంలో ప్రతి వ్యవహారాన్ని,అవినీతి అక్రమాలకు పాల్పడే రాజకీయ వ్యవస్థను, ప్రజాస్వామ్య పరి రక్షణకు నిత్యం పాటుపడే మీడియాను వీరు తమ కబంధహస్తాలలో చేజి క్కించుకున్నారు.

      ప్రజా సేవే తన సేవ అంటూ రాజకీయ పార్టీలు పెట్టే వారు సమాజానికి వారి సేవలు ఎలా ఉన్నాయో.... తెలియంది ఏమీ కాదు.పాకెట్లో పైసా ఉంటే ప్రపంచమే పిల్లవుతుంది పులై మనం బతికేయచ్చు అన్న విధం గా ఓ రాజకీయ పార్టీ పెట్టుకోవడం,దానిని నడిపించేందుకు ఓ పత్రిక లేదా ఓ ఛానల్ పెట్టు కోవడం.ఇక తాము చెప్పేది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడని విధా నాలు అవలంభిస్తూ తాము చేసేది తప్పు అయినా దర్జాగా అదే ఒప్పు అన్నట్లు తాము స్థాపించిన మీడియాలో ప్రచురణ/ప్రసారాలు చేస్తూ ప్రజలను వెర్రి గొర్రెలుగా భావించి మీడియా రంగా న్ని పాడుచేశారు ఈ పెట్టుబడి దారులు ఒక్క రాజకీయ పార్టీలే కాదు. కాస్త డబ్బున్న ప్రతి క్యాపటలిస్ట్ ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ఒక్కో వ్యవస్థ ఒక్కో పత్రిక ఒక్కో ఛానల్ పెట్టుకుని మీడియా ను స్వప్రయోజ నాలకు వాడేస్తున్నారు.

      ఇలా పెట్టుబడి దారుల కబంధహస్తాలలో చిక్కిన మీడియా తీరును ఓ సారి పరిశీలిస్తే రాజకీయ నాయకులు,రాజకీయ పార్టీలు ప్రజాసేవ ఆంటూ తన సేవ ఎంతో గొప్పదని చెపుతూ ఏదో ఒక మీడియాను అడ్డం పెట్టుకుని మరింత ఎదిగిపోతున్నారు.ఇంకొంత ముందడుగు వేసిన పెట్టుబడి దారులు కుల-మత వ్యవస్థలను పోషిస్తూ కులానికో పేపర్-మాతానికి ఓ ఛానల్ పెట్టుకుని వర్గ విభేదాలు లేని వ్యవస్థకోసం అని వారు చెప్పేదే నిజం అంటూ తన కుల మతాల మనుగడ కోసం 24 గంటలు బాకా ఊదుతూ,బ్యా0డ్ బాజా వాయించే మీడియా సంస్థల ఉన్నాయా...?లేదా...?అనేది కూడా ప్రజలు పరిశీలన చేయాలి. ఇలా వ్యవహరిస్తున్న కొన్ని మీడియా సంస్ధలు ఏ ప్రయోజనాల కోసం పని చేస్తుంది అనేది ప్రజలు మరింత లోతుగా పరిశీలన చేయాలి.ఇలాంటి మీడియా సంస్థలు దొంగలా...?లేదు అందులో పని చేసే జర్నలిస్ట్ లు దొంగలా...?ఇలా ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడు తున్న జర్నలిజంలో తమ పేరులోని మొదటి అక్షరాన్ని, లేదా తమకు లక్కీ నెంబర్ గా భావించే అంకెలను,ఇంటి పేర్లను, ఇష్ట దైవాల పేర్లు పెట్టి సామాజిక భాధ్యత, సామాజిక భద్రత ఏ మీడియా వ్యవస్థ అయినా కల్పిస్తుందా...?ఇటువంటి విధానాలు కలిగి ఉన్న కొన్ని మీడియా సంస్థలను నడిపించే శక్తి,అవసరం ఎవరికి ఉంటుంది పెట్టుబడి దారులకేగా...!ఏ పెట్టుబడి దారుడైన సొంత లాభం లేకుండా వ్యవహ రిస్తారా...?ధనార్జన కోసం మీడియా రంగంలో కూడా పెట్టుబడి దారులు ప్రవేశిం చడంతో జర్నలిజంలో దొంగలు పడ్డారు అని ఓ పాత్రికేయుడిగా ఒక్క బల్ల కాదు... వంద బల్లలు గుద్ది చెబుతున్నా...అలాగే ఇప్పుడు మీడియా రంగం గాడి తప్పింది,మీడియా రంగం ఇప్పుడు విలువలకు తిలోదకాలు ఇచ్చింది, మీడియా రంగం కొంత కాలంగా చెడిపోయింది, మీడియా రంగం ఇప్పుడు ధనార్జనకు వేదిక అయ్యింది,మీడియా రంగం గత కొంతకాలంగా అవినీతి-అక్రమార్కులకు, నేరస్తులకు సేఫు జోన్ గా మారింది. మీడియా రంగం రాజకీయ పార్టీలకు కరపత్రాలుగా మారింది. సామాజిక భాధ్యత, సామాజిక భద్రత,మూఢ నమ్మకాలతో ఉన్న జనాన్ని ,ప్రజలను సామాజిక వ్యవహారాల్లో చైతన్య పరచలేక కుంటి గుర్రంపై గుడ్డి వాడు సవారీ చేస్తున్నట్లు ఈ రోజున మీడియా రంగం తాను చెప్పిందే వేదంలా ప్రజల కళ్ళు, నోరు,చెవులు టీవీ ఛానల్స్ కి/పేపర్స్ కి అతికించేసింది.ఈ పెట్టు బడి దారీ వ్యవస్థ.

జర్నలిస్ట్ లలో దొంగలు ఉన్నారు అనే కొందరి భావన వాస్తవమే…!

     మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పదలచుకున్న అంశం మన జర్నలిస్ట్ లు అందరూ న్యాయంగా ఆలోచించాలి. మనలో అందరూ దొంగలే ఉన్నారు అని మొదటి నుండి  చెప్పటం లేదు.ఈరోజు వరకు జర్నలిజం వృత్తిలో ఎంతో అంకితభావంతో, విలువలతో పనిచేసే జర్నలిస్ట్ లు ఇంకా ఎందరో ఉన్నారు.ఇలా విలువలతో జర్నలిస్ట్ లుగా పనిచేసే జర్నలిస్ట్ లు మన మీడియా రంగంలో దొంగలు ఉన్నారా...?లేదా...?అనేది తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే సమయంలో ప్రస్తుత మీడియా పరిస్థితులు చూసి ప్రజాక్షేత్రంలో అధికశాతం  ప్రజలకు జర్నలిజంలో దొంగలు ఉన్నారు అనే ప్రజాభి ప్రాయాన్ని గౌరవించి మన జర్నలిస్ట్ లు వారి అభిప్రాయాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే జర్నలిస్ట్ గా పని చేసే వారు ఎవరైనా ప్రజల అభిప్రా యాలను గౌరవించే గుణం కలిగి ఉంటారు.అలా ప్రజల అభిప్రాయాలను గౌరవించలేని వారు జర్నలిజం వృత్తిలో కొనసాగడానికి,జర్నలిస్ట్ గా పని చేయడానికి అర్హులు కాదు అని నా అభిప్రాయం. ఇక వారి అభిప్రాయాలకు సరైన సమాధానం చెప్పి మనపై వారికి ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగిం చాల్సిన భాధ్యత మనపై ఉంది.ప్రజలకు మన జర్నలిస్ట్ లపై ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించే దిశగానే ఈ చాప్టర్ రాయడం జరిగింది.ఇక అలాంటి భావన కలిగిన వారికోసం ఇక్కడ రాయ బడిన అంశాలు పరిశీలన చేయాల్సిందిగా మనవి.

   ఇప్పటికే జర్నలిజంలో

దొంగలు ఎవరు అనేది చెప్పటం జరిగింది. మా జర్నలిస్ట్ లపై మంచి అభిప్రాయం లేని వారి కోసం మరింత లోతైన అంశాలతో ఈ వ్యాసం రాయబడిందిగా గ్రహించాలి.ఇప్పటి వరకు పెట్టుబడి దారీ వ్యవస్థ జర్నలిజంలో చేరి జర్నలిజాన్ని,జర్నలిస్ట్ లను బ్రష్టు పట్టించింది అని తెలుసుకున్నాం.ఇక ఇదే పెట్టుబడిదారీ వ్యవస్థ మీడియా ముసుగులో పారిశ్రామిక రంగాన్ని,సినీ రంగాన్ని,విద్యా-వైద్య రంగాలను,రాజకీయ రంగాన్ని మరికొన్ని రంగాలతో పాటు,ప్రభుత్వ వ్యవస్థ మరికొన్ని వ్యవ స్థలను ఆసరాగా చేసుకుని ధనార్జన కోసం మీడియా రంగాన్ని వ్యాపారంగా మార్చింది.ఇందులో భాగం గా పైన చెప్పబడిన రంగాల కు,వ్యవస్థల ఎదుగుదలకు ఆ రంగం అలా,ఈ రంగం ఇలా,ఆ వ్యవస్థ అలా-ఈ వ్యవస్థ ఇలా ఆంటూ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి స్పెషల్ ప్యాకేజిలు తీసుకుని మీడియా పేరిట ప్రచురణ/ప్రసారాలు చేసి మీడియా సంస్థలు ధనార్జన చేస్తు న్నాయి.ఇక్కడే ప్రజలు సరియైన ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యం, సామాజిక భాద్యత, సామాజిక భద్రత అంటూ లైసెన్సులు తెచ్చుకుని ప్రజలకు ఎంత వరకు సామాజిక బాధ్యత,భద్రత కల్పిస్తున్నాయి మీడియా సంస్థలు సమాధానం చెప్పాల్సిన అవసరం మీడియా సంస్థలకు ఉంది. ఈ విధంగా పైన చెప్ప బడిన రంగాలన్నింటి నుంచి,వ్యవస్థల నుంచి అవి తుమ్మినా- దగ్గినా ఆహా…ఓహో అంటూ భజన కార్యక్రమాలతో వారి నుండి మీడియా సంస్థలు ప్రకటనలు పొందటం లేదా…?ఉదాహరణకు చిన్న విషయం అందరికి అవగాహన ఉన్నదే…!ప్రవేట్ విద్యా సంస్థల వ్యవహారం. పరీక్షా ఫలితాలు వెలువడి నప్పుడు ఆ విద్యాసంస్థ ర్యా0కుల మోత,ఈ విద్యా సంస్థ విజయడంఖా- విజయ దుందుభి ఆంటూ మీడియాలో వచ్చే ఫుల్ పేజీ ప్రకటనలు,చానల్స్ లో ఒకటి…. ఒకటి….ఒకటి… ఆంటూ,రెండు….రెండు…, మూడు….మూడు అంటూ ఒక్కో ర్యా0కు పది సార్లు భారీ శబ్దాలతో ఊదరగొట్టి ఆయా విద్యా సంస్థల నుండి లక్షల లక్షల ప్రకటనలు పొంది,అవి చాలక ఆయా విద్యా సంస్థల నిర్వాహకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో అలాగా….ఆహా….,ఇలాగా….ఓహో అంటూ ఎవరి మెప్పు కోసం-ఎవరి లాభం కోసం ఈ ఊక దంపుడు ప్రకటనలు.ఇక ప్రభుత్వం ఈ విధానాలకు చెక్కు పెట్టింది కాబట్టి సరి పోయింది. లేదంటే ఈ ప్రకటనల టార్చర్ మాములుగా ఉండేది కాదు.ఈ ప్రకటనలు చూసి పిల్లల భవిష్యత్ బాగుం డాలి అని నిత్యం ఆలో చించే ఆర్ధిక స్థోమత లేని తల్లిదండ్రులు ప్రకటనలు చూసి మోసపోయి అక్కడ విద్య బాగున్నా….బాగో లేక పోయిన పిల్లల కోసం వేలకు వేలు ఫీజులు పోసి మరి ఏ మాత్రం పిల్లల భవిష్యత్ బాగుచేసు కుంటున్నారో….లేదో గానీ అలాంటి విద్యా సంస్థలు దోపిడీకి విద్యార్థుల తల్లిదండ్రులు గురవు తుంటే,ఇలా వ్యవహరించే విద్యా సంస్థలు మీడియాని వేదిక చేసుకుంటున్న వైనాన్ని మీడియా సంస్థలు కూడా ఆ విద్యా సంస్థల అవస రాలను ఎంచక్కా క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి సామాజిక భాద్యత అంటూ పురుడు పోసుకున్న ఏ మీడియా అయినా అన్ని తరగతుల విద్యార్థుల కోసం రోజుకో గంట,రెండు గంటలు నిపుణులైన అధ్యాపకుల తో బోధనా క్లాసులను నిర్వహిస్తున్నాయా….? ఎందుకు ప్రసారం చేయవు…?ఇదేనా మీడియా చెప్పుకుంటున్న సామాజిక భాద్యత అంటే…?ఈ విషయంలో కొన్ని పత్రికలను కొంత మేరకు మినహాయించాలి. ఎందుకంటే కొన్ని పత్రికలు విద్యార్థుల పాఠ్య0శాలకు సంభందించిన మెటీరియల్ అందిస్తున్నాయి కాబట్టి. ఇలా అన్ని రంగాలను మీడియా సంస్థలు దోచుకుంటున్నాయి.ఇది కాదా జర్నలిజంలో దొంగలు పడ్డారు అంటే…!ఇక్కడ చెప్పండి జర్నలిస్ట్ లు దొంగలా …?మీడియా సంస్థలు దొంగవా …?ఇక్కడ కూడా చెబుతున్నా అన్ని మీడియా సంస్థలు గురించి చెప్పటం లేదు. సామాజిక భాద్యత వహించని మీడియా సంస్థల గురించి మాత్రమే చెపుతున్నా….

క్రింది స్థాయి జర్నలిస్ట్ లను దొంగలు గా భావిం చరాదు

      రామాయణం అంతా విని రాముడు ఎవరు....?రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరు....అనే వారి కోసం ఈ చాప్టర్ లో చివరి అంశంగా చెబుతున్నా... జర్నలిజంలో దొంగలు ఉన్నారు అనే భావన కలిగిన వ్యక్తులకు ఇప్పటికే ఎవరు దొంగలు అనేది పూర్తిగా భోధపడి ఉంటుంది.ఇంకా క్లారిటీ కోసం మరికొన్ని విష యాలు చెప్పదలుచు కున్నా....అసలు జర్నలిజం ఎందుకు గాడి తప్పింది. జర్నలిస్ట్ లు అందరూ దొంగలు కాదు వివరణ ఇస్తూనే వస్తున్నా.... కానీ అసలు చెప్పాల్సిన విషయం ఇది.అందరికి క్రింది స్థాయిలో నిత్యం మీ మధ్య తిరిగే చిన్న చిన్న  జర్నలిస్ట్ లనే ప్రజలందరు దొంగలు అనుకుంటున్నా రు.ఇది అక్షరాలా తప్పు. మీడియా సంస్థలు జర్నలిస్ట్ లను ఏ విధంగా వాడు కుంటున్నాయి. బరువు భాద్యతలు ఎలా నెత్తిన పెడుతున్నాయి. ఆయా మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్ట్ లు ఆయా సంస్థల ఒత్తిళ్ల మధ్య ఎంతగా నలిగి పోయి,మానసిక వత్తిళ్లకు గురవుతూ ప్రాణాలను హరించే వ్యాధులకు గురవుతున్నారో ఎంతమంది గ్రహించ గలరు.ఇన్ని బాధలు పడుతూ జర్నలిజం ఓ హాబీగా కనీస గౌరవ వేతనం లేకపోయినా వృత్తి పట్ల నిబద్ధతగా పని చేసే జర్నలిస్ట్ లు తమ కుటుం బాలను ఎలా బ్రతికించు కోవాలి..? సైన్యంలో పనిచేసే సైనికుడు సైతం జీతం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా ఎందుకు సైన్యంలో చేరుతున్నారు.బ్రతక టానికి ఆదాయం కావాలి కాబట్టి.శత్రు దేశాలతో సరిహద్దుల్లో ప్రాణాలను లెక్క చేయక పోరాడే సైనికుల్లా,దేశంలో మన పాలకులు,అధికారులు,పలు వ్యవస్థల్లో, రంగాలలో జరిగే అవినీతి అక్రమాలు, లంచగొండి వ్యవహారాలు, పలు తప్పుడు వ్యవహారా ల నుండి స్వచ్ఛమైన ప్రజాస్వామ్య విధానాలు అమలు అయ్యేందుకు సమాజం పట్ల భాద్యత- భద్రత కోసం,వెనుకబడిన వర్గాల అభివృద్ది కోసం ఇలా ప్రతి వ్యవహారంలో ప్రజాక్షేమం కోరుతూ కలం పట్టి అక్షరాలను ఆయు ధాలుగా మలిచి మా జర్నలిస్ట్ లు చేస్తున్న నిత్యపోరాటం సిరా చుక్కల సంగ్రామం దేశ సైనికులతో పోల్చితే ఏ మాత్రం తక్కువ కాదు. మీడియా సంస్థలు కనీస గౌరవవేతనం ఇవ్వక పోయినా జీతం తీసుకుని పనిచేసే సైనికులతో పోల్చితే మా జర్నలిస్ట్ లు ఏ మాత్రం తీసిపోరు.జీతం లేని కొలువుల్లో మా జీవి తాలు మా కుటుంబాలు ఎలా బ్రతకాలి అందుకే మాకు ఇక్కడ ఓ అవకాశం ఉంది. ఒక ప్రెస్ మీట్ జరిగినా, ఓ ప్రారంభోత్సవం జరిగినా, మరే చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినా ఆయా నిర్వాహకులు గౌర వంగా బ్రవున్ ఎన్వలపు జర్నలిజం పేరిట మాకు ఇచ్చే500/-,1000/- రూపాయలు ద్వారా మేము దొంగలం అవుతామా...?మేము ఎప్పటికీ 500లు 1000 రూపాయల గాళ్లమే,ఇలా 500లు 1000 రూపాయలు గౌరవంగా ఇచ్చే చేతులను కూడా పాము పడగల్లా భావించే విలువలు కలిగిన జర్నలిస్ట్ లు మా క్రింది స్థాయి జర్నలిస్ట్ ల్లో ఎంతోమంది ఉన్నారు.ఇక్కడ చెప్పే అంశం కూడా మననం చేసుకోండి. ఎవరు ఏ ప్రయోజనాల కోసం చేసే వ్యవహారాలనైనా పెంచి పోషించేందుకు అధిక మొత్తాలలో మీడియా సంస్థలు బొక్కేస్తుంటే, వాటిని ఆసరాగా చేసుకుని మా మీడియా సంస్థలకు చెందిన కొందరు పెద్ద సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళి గంటా-అరగంటా కార్య క్రమాలు నిర్వహించి అంతా ముగిశాక నిర్వాహకుల నుండి పెద్ద మొత్తం లో స్పెషల్ ప్యాకేజీలు దండుకుని వెళ్ళే వారు దొంగలు కాదా...?గౌరవంగా చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా 500లు,1000లు తీసుకునే మా క్రింది స్థాయి జర్నలిస్ట్ లే ప్రజలకు దొంగలుగా కనపడుతున్నా రా....?అయితే ఇక్కడ కూడా ఒకటి చెప్పాలి ప్రజలకు తెలిసి క్రింది స్ధాయి జర్నలిస్ట్ ల్లో కూడా దొంగలు ఉన్నారనే భావన ఇంకా చాలా మందికి ఉండవచ్చు.దానికి కూడా పైన వివరణ ఇవ్వడం జరిగింది.అదే సింపుల్ గా చెపుతున్న మళ్ళీ... అవినీతి- అక్రమార్కు లు,నేరస్థులు మీడియా సంస్థలతో మిలాఖత్ అయ్యి లక్షలు లక్షలు యాడ్స్ టార్గెట్ చేస్తాం ఆంటూ నమ్మబలికి ఒక ఐడీ కార్డు, పేరూ- ఊరూ లేని ఓ చిడత (లోగో) చేత బట్టి పెద్ద ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ల్లా ఫోజు కొడు తూ అందిన కాడికి అంది నంత దోచుకుని మనుగడ సాగిస్తున్న కొందరు  జర్నలిస్ట్ లే అసలైన దొంగలు.
 వ్యాస కర్త

ఈపూరి రాజారత్నం
M.A.,(Ph.D)
Journalism
ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
మంగళగిరి
9390062078

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article