టిడిపి నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి
కడప అర్బన్:అబద్దాలతో అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, తిరిగి అధికారంలోకి వస్తామన్న, వైసీపీ నేతల ఆశలు దింపుడు గల్లం ఆశలే అని టిడిపి నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి తేల్చి చెప్పారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విస్మరించి, ప్రజా వ్యతిరేక పాలన సాగించిన ఈ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని చెప్పారు. బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, ముస్లిం మైనార్టీలకు మొండి చేయి చూపారన్నారు. పేరుకే కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఒక్క రూపాయి విడుదల చేయలేదని ఆయన ఎత్తి చూపారు. అభివృద్ధి శిలాఫలకాలికే పరిమితం అయ్యిందన్నది, జగన్ వేసిన అభివృద్ధి శిలాఫలకాలే చెబుతున్నాయని ఆయన విమర్శించారు. నిజం చూపితే దాడులు, నిరసనలు చేస్తే అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. యువత, నిరుద్యోగులను డీఎస్సీ పేరుతో మభ్యపెట్టి, తిరిగి మోసగించేందుకు మినీ డీఎస్సీని విడుదల చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పిస్తామని యువ నేత నారా లోకేష్ యువ గళం లో నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారన్నారు. టిడిపి వైపు ప్రజలు చూస్తున్నారని, ఏ డివిజన్ కు వెళ్లిన యువత, నిరుద్యోగులు, మహిళలు పార్టీలోకి స్వచ్ఛందంగా చేరడం, టిడిపి గెలుపుకు నాంది అన్నారు. కడప టిడిపి అసెంబ్లీ అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి విజయాన్ని ఎవ్వరు ఆపలేరని, టిడిపి విజయ ఢంకా మ్రోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి జయకుమార్, సీకే దిన్నె బీసీ నాయకులు రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.