టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు
బుట్టాయగూడెం:ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల వైసిపి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యధోరణితో వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం బొరగం శ్రీనివాసులు అన్నారు. బుట్టాయగూడెం మండలంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలు పెద్దూరు, తెల్లవరం, తూటిగుంట, పైడాకులమామిడి, పల్లపూరు ఆర్ & ఆర్ కాలనిల్లో బుధవారం శ్రీనివాసులు పర్యటించారు. కాలనీలలో నివాసముంటున్న నిర్వాసితులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను శ్రీనివాసులతో ఏకరవుపెట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో బొరగం మాట్లాడుతూ నేను నిర్వాసితుడినే కనుక నిర్వాసితుల బాధలు స్వయంగా అనుభవిస్తున్నానని అన్నారు. జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆర్ & ఆర్ ప్యాకేజీ రూ.10 లక్షల అని, 2006-07 సంవత్సరంలో ఎకరానికి రూ.1.15 లక్షలు పరిహారం ఇచ్చిన భూములకు మరల ఎకరానికి రు.5 లక్షలు ఇస్తానని మోసం చేశాడని అన్నారు. నిర్వాసితులకు తెదేపా హయాంలో ఇండ్ల నిర్మాణ చేపట్టి ప్యాకేజీలు ఇచ్చి కాలనీలకు తరలించామని, వైసిపి ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించటంలో కూడా విఫలమయ్యారని విమర్శించారు. తెదేపా, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడుతో చర్చించి ఆర్ & ఆర్ కాలనీల్లో అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని, స్మశానవాటికల నిర్మాణం పూర్తి చేసి, అర్హత కలిగి ఇప్పటివరకు ఎవరికైతే ప్యాకేజీలు అందలేదో వారందరికీ ప్యాకేజీలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. తెదేపా జనసేన అధికారంలోకి రాగానే అమలు చేసే సూపర్ సిక్స్ పదకాలను వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మిడియం వెంకటస్వామి, మడకం బుచ్చిరాజు, బొడ్డు బాపిరాజు, సోదెం బుచ్చిరాజు, చింతలాడ రామిరెడ్డి, కుంజం బుచ్చిరాజు, యండపల్లి గంగరాజు, మడకం వీరాస్వామి, కొవ్వాసు సంకురు, పాములేటి కన్నారెడ్డి, సుంట్రు బాబురావు, కొండ్ల రామిరెడ్డి, కారం సురేష్, మడకం శ్రీను, యండపల్లి నాగు, కుంజం నాగు, తదితరులు పాల్గొన్నారు.