పదవీ విరమణ సన్మాన సభలో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు.
కడప బ్యూరో:మంచి వ్యక్తిత్వం, విధి నిర్వహణలో మచ్చలేని సేవలు ఒక ఉద్యోగి యొక్క జీవితాన్ని అభినందన కుసుమాలతో పరిమళింపజేస్తాయని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ విసి హాలులో కలెక్టరేట్ లో సూపరింటెండెంట్ (తహశీల్దార్)గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన గుంటి వెంకట రామనకు.. జిల్లా రెవెన్యూ, పరిపాలన విభాగం అధికారులు నిర్వహించిన పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభకు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు.. జేసీ గణేష్ కుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…విధి నిర్వహణలో ప్రజల జీవితంలోకి తొంగి చూసినపుడే.. వారి స్థితిగతులు, సాధక బాధలు అర్థం అవుతాయన్నారు. విధి నిర్వహణలో పారదర్శకంగా పని చేసినప్పుడే.. అధికారులకు అన్ని స్థాయిల నుండి గుర్తింపు, ప్రశంసలు అందుతాయన్నారు. 39 ఏళ్ళ తన రెవెన్యూ సర్వేసులో వెంకట రమణ వివిధ హోదాల్లో పని చేసి.. కలెక్టరేట్ లో సూపరింటెండెంట్ గా పదవీ విరమణ పొందడం ఆయన బాధ్యతాయుతమైన సేవలను గుర్తు చేస్తుందన్నారు. జీవితంలో ప్రతి వ్యక్తికి కుటుంబం అనేది ఒక బాధ్యతాయుతమైన బంధం అని.. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఉద్యోగ ఒత్తిళ్ళు లేని.. ప్రశాంత శేష జీవనాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రధాన్యతనివ్వాలన్నారు. ఎంతో కాలం పాటు.. ఉద్యోగ జీవితంలో పై అధికారులకు సహకారం అందించిన ఉద్యోగులను జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి ఒక మధుర జ్ఞాపకం అని.. అలాంటి రోజును ఆనందంగా గడిపేల.. ఉద్యోగులు అందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేసేయాలని, ఉద్యోగ కాలమంతా కర్తవ్య నిబద్ధతతో పని చేయాలని కోరారు. అనంతరం వెంకట రమణకు శాలువా, పూలమాలలతో సన్మానం చేశారు. ఒక్కో సెక్షన్ వారు ఒక్కో జ్ఞాపికలను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో గంగాధర్ గౌడ్, ఓఎస్డీ రఘునాథ్, కలెక్టరేట్ పరిపాలనధికారి విజయ్ కుమార్, అన్ని సెక్షన్ల సూపరింటెండెట్లు, సీనియర్ అసిస్టెంట్లు, తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.