టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి
కడప సిటీ:తాడేపల్లిగూడెంలో జరిగిన టిడిపి, జనసేన సభ తో తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ద్వారకా నగర్ లోని ఆయన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ టిడిపి, జనసేన కలిసింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే అన్నారు. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసంలోకి తీసుకెళ్లారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హత్య చేసి, డోర్ డెలివరీ చేశారని గుర్తు చేశారు. కరోనాలో ఫేస్ మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ను మానసిక వికలాంగుడిగా ముద్ర వేసి చంపారన్నారు. వైసిపి వేధింపులు భరించలేక అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు హనుమ విహారి పారిపోయారని, జగన్ రెడ్డి పెత్తందారు పోకడకు నిదర్శనం అన్నారు. వై నాట్ 175 అంటున్న జగన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలో అని ఓటర్లు ప్రశ్నించుకోవాలి అన్నారు. కడప టిడిపి అసెంబ్లీ అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి మాట్లాడుతూ ప్రతి ఏడుజాబు క్యాలెండర్ విడుదల చేసి యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న జగన్, పాలన కాలం అయిపోతున్న ఎక్కడ జాబ్ క్యాలెండర్ జాడ అని ఆమె ప్రశ్నించారు. డీఎస్సీ లేదు, ఉచిత ఇసుక ఊసే లేదని, ఇసుక వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపించిందని, అక్రమ ఇసుక రవాణాపై ఆమె మండిపడ్డారు. పులివెందులలోని జగన్ రెడ్డికి ఓటమి తప్పదు ప్రజల ప్రయోజనాల కోసమే సూపర్ సిక్స్ ను ప్రవేశ పెట్టామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని ఎలా చేయాలో టిడిపి వద్ద బ్లూ ప్రింట్ ఉందన్నారు. అధికారంలోకి రాగానే, ఓటు వేసిన ప్రజలకు జవాబుదారి పాలనగా, యువతకు ఉద్యోగాలు, రైతులకు సాగునీరు అందించి, పాలన సొమ్మును సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందిస్తామన్నారు. టిడిపి, జనసేన పొత్తు సూపర్ హిట్, టిడిపి విన్నింగ్ వైసిపి లూసింగ్ అని చమత్కరించారు.