Thursday, November 13, 2025

Creating liberating content

తాజా వార్తలురైల్వే రోడ్డు విస్తరణ కథ కంచికేనా….!బాండ్ల కోసం యజమానుల నిరీక్షణ

రైల్వే రోడ్డు విస్తరణ కథ కంచికేనా….!బాండ్ల కోసం యజమానుల నిరీక్షణ

హిందూపురం టౌన్
ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న హిందూపురం పట్టణంలో రహదారులను విస్తరించేందుకు నిర్ణయించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం తర్వాత హిందూపురం పెద్ద పట్టణముగా గుర్తింపు ఉంది. దీంతో హిందూపురం పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అధికారులు, పాలకులు ప్రధాన రహదారిగా ఉంటున్న రైల్వే రోడ్డు విస్తరించినందుకు చర్యలు చేపట్టారు. అయితే ఆరంభం నుండి ఈ రహదారి విస్తరణ పనులు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కు అన్నచందంగా మారింది. ప్రస్తుతం ఆ రహదారి గురించి పట్టించుకోకపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది.
హిందూపురం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రధాన రహదారి అయిన కిలోమీటరు పొడవు ఉన్న రైల్వే రోడ్డును విస్తరిస్తామని నాలుగేళ్ల క్రితం ముందుకొచ్చిన పాలకులు చేత గాక, చివరకు ఏమీ చేయలేక అర్ధాంతరంగా వదిలేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అహుడా నిధులు కేటాయించినా, గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో రోడ్డు విస్తరణ కథ కంచికి చేరిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి నిర్మాణానికి రూ.5 కోట్లు నిధులు ఇస్తామని అహుడా అధికారులు దస్త్రాలు పంపినా, నాలుగేళ్లుగా రహదారి విస్తరణ ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. చివరకు సగం రహదారైనా వేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించి, రోడ్డు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేని బాలాజీ సర్కిల్ నుంచి నంది విగ్రహం వరకు అర కిలో మీటరు నిర్మాణానికి అహుడాకు ప్రతిపాదనలు పంపారు. అన్ని అనుమతులు తీసుకొని టెండర్లు పిలిచారు. అయితే బిల్లుల మంజూరు అహుడా నేరుగా చేయకుండా, సీఎఫ్ఎంఎస్ ద్వారా ప్రభుత్వమే చేస్తుందని టెండర్లలో పేర్కొనడంతో గుత్తేదారులు దాఖలుకు ముందుకు రాలేదు. సీఎఫ్ఎంఎస్ లో బిల్లుల చెల్లింపు అంటే గుత్తేదారులు వణికిపోతున్నారు. గతంలో చేసిన పనులకే ఏళ్ల తరబడి బిల్లులు రాలేదని, ఇప్పుడు ఎన్నికల సమయంలో చేసే పనులకు వస్తాయో, రావో అని భయంతో ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు. తమకు కావాల్సిన గుత్తేదారులు ఉన్నారని, వారి పేరుతో తామే టెండర్లు వేస్తామని, పనులు చేస్తామని చెప్పిన అధికార పార్టీ నాయకులు సైతం వెనుకంజ వేశారు. దీంతో ఇక రైల్వే రోడ్డు నిర్మాణం ఇప్పట్లో జరగనట్లేనని తెలిసిపోయింది. కొత్తగా రోడ్డు వేస్తామని, అధికారులు కొన్నేళ్లుగా కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. దీంతో గుంతలమయంగా మారిన ఈ రహదారిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది.
బాండ్ల కోసం స్థల యజమానులు నిరీక్షణ
రహదారి విస్తరణకు 130 మంది తమ భవనాలను కోల్పోయారు. భవనాలను కూల్చివేసి, నేలను చదును చేశారు. అయితే వీరిలో ఒక్కరికంటే ఒక్కరికీ నష్టపరి హారం అందలేదు. స్థల విలువకు నాలుగింతలు చేసి మున్సిపల్ బాండ్లను ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఇవ్వ లేదు. ఈ బాండ్లను ఇస్తే వారు వాటిని విక్రయించుకొని, తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని పొందవచ్చు. అయితే ఇప్పటి వరకు బాండ్లను ఇచ్చే ప్రక్రియను కూడా పాలకులు, అధికారులు ప్రారంభించలేదు. బాండ్లను అందజేయాలంటే, స్థల యజమానుల వివరాలను, డాక్యుమెంట్లను సేకరించడం, స్థల విస్తీర్ణం లెక్క కట్టడం చేసి, అన్ని వివరాలను ఆన్ లైన్ చేయాలి. అనంతరం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, టౌన్ ప్లానింగ్ అధికారుల ఓ కమిటీగా ఏర్పడి బాండ్ల జారీకి అనుమతులు ఇవ్వాలి. వాటిని పురపాలక శాఖ ఉన్నతాధికారులు పరిశీలించి, ఆన్ లైన్ విధానంలో బాండ్లను జారీ చేయాలి. అయితే ఈ ప్రక్రియ ఎక్కువ క్లిష్టతతో కూడి ఉండటం, ఎక్కువ సమయం పడుతుందని, తాము కొన్ని నెలలు మాత్రమే ఇక్కడ పని చేస్తామని, ఎప్పుడైనా వెళ్లిపోవాల్సి ఉంటుందని కొన్నేళ్లుగా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రహదారి విస్తరణకు ఉదారంగా స్థలాలు ఇచ్చిన యజమా నులు నిండా మునిగారు. పరిహారపు బాండ్ల కోసం కార్యాలయం చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా రైల్వే రోడ్డు విస్తరణ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article