ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభలో స్టేజీ కూలింది. అయితే రాహుల్ గాంధీ సహా ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బీహార్‌లోని పాటలీపుత్ర లోక్ సభ స్థానానికి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా పాట్నా శివారులోని పాలీగంజ్‌లో బహిరంగసభలో పాల్గొన్నారు.రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, మీసా భారతి తదితరులు వేదిక పైకి చేరుకున్నారు. ఈ సమయంలో వేదిక ఒక్కసారిగా కాస్త కిందకు పడిపోయింది. దీంతో రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది అతనిని కిందకు దించే ప్రయత్నాలు చేశారు. దానికి ఆయన వద్దని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.