ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పారదర్శకత మరియు ప్రజా సేవలను మెరుగుపరచడానికి టీడీపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. బ్రిటీష్ కాలం నుండి కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం, సబ్ రిజిస్ట్రార్లు భారీ పోడియాలపై కూర్చుని విధులు నిర్వహించేవారు. ఈ పోడియాలను రాచరిక పోకడకు నిదర్శనంగా భావించి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రజలతో నెలకొల్పే ఉద్దేశంతో వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మార్పుల అనంతరం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు మరియు ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండేలా చేయడమే లక్ష్యం. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పోడియాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని పటమట, గుణదల, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పోడియాలు తొలగించడం యుద్ధప్రాతిపదికన జరిగింది.ఈ మార్పుల్లో రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆర్ పి సిసోడియా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ శ్రీధర్ బాబులు స్వయంగా పాల్గొని, గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డయాస్ మరియు ఇతర ఆవరణాలను తొలగించారు.