లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా మంగళవారం కొనసాగుతున్న మూడో దశ పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఉదయం 7:30 గంటల సమయంలో ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. మోదీకి కేంద్ర మంత్రి అమిత్ షా స్వాగతం పలకగా.. ఇద్దరు నేతలు బూత్ వద్దకు వెళ్లారు. కాగా ప్రధానిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. రోడ్డు పక్కన నిలబడి మోదీ అనుకూల నినాదాలు చేశారు. ఒక అభిమాని మోదీ చిత్రపటాన్ని తీసుకొని రాగా దానిపై ప్రధాని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, కాబట్టి అందరూ తరలి వచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు. దేశంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలు వీలైనంత ఎక్కువ మంది ఓటు వేయాలని సూచించారు. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలివుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.మరోవైపు ఎన్నికలకు సంబంధించి నిర్విరామంగా కవరేజీ అందిస్తున్న మీడియా ప్రతినిధులను మోదీ మెచ్చుకున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆయన సూచించారు. నీరు బాగా తాగాలని అన్నారు.