Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుఅమలుకు నోచుకొని ప్లాస్టిక్ నిషేధం…..!!!

అమలుకు నోచుకొని ప్లాస్టిక్ నిషేధం…..!!!


-జిల్లాలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం
-తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు
ప్రజాభూమి హిందూపురంటౌన్
ప్లాస్టిక్ నిషేదంపై కేంద్రం ప్రభుత్వ ఆదేశాలను హిందూపురం పురపాలక సంఘంతో పాటు జిల్లా వ్యాప్తంగా దీనిని కఠినంగా అమలు చేయాల్సిన అధికారులు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు కల్పతరువుగా మార్చుకుంటునన్నట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని ఎక్కడా విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అమ్మకాలు జరు పుతూ పట్టుబడితే వారి కమర్షియల్ లైసెన్సులను రద్దు చేసే అవకాశం ఉంది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరిగణిస్తారు. రోజూ మనం వాడి పారేసే స్ట్రాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు, సోడా బాటిళ్లు, ప్లేట్లు, కప్పులు, ఆహారం ప్యాకేజీ కంటెయినర్లు, ఇయర్ బడ్ విత్ ప్లాస్టిక్ స్టిక్స్, సిగరెట్ ఫిల్టర్స్ , లాలీపాప్, చాక్లెట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్ క్రీమ్ స్టిక్స్, ధర్మో కోల్, 100 మైక్రాన్ల లోపు మందం గల సివిసి బ్యానర్లు, ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు తదితర 16 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర నిషేధించింది. అయినప్పటికి గ్రామ స్థాయి నుంచి పట్టణ, నగర స్థాయి వరకు ఎక్కడ నిషేధాన్ని అమలు చేయడం లేదు. ఇది చాలద న్నట్లు పట్టణంలో కొంత మంది ఇడ్లీ చేసే సమయంలో సైతం ప్లాస్టిక్ పేపర్ వాడుతున్నారు. హోటల్స్ లో సైతం కూరలు, టీ పార్సిల్ సైతం ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. ఇది తెలిసినప్పటికి మున్సిపల్, ఆహార భద్రత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూతం
స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షన్ వంటి కార్యక్రమాలు జిల్లాలో నగరాలు, మున్సిపాలిటీల్లో అమలవుతున్నా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అన్ని పంచాయితీల్లో రోజుకి సుమారు 11 టన్నులకు, ప ట్టణాలు, నగరాల్లో అయితే దాదాపు 60 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి జరుగుతోంది. దాంతో ప్రజారోగ్యం దెబ్బతింటుంది. హిందూపురం పురపాలక సంఘంలో 38వార్డుల్లో సుమారు 1. 90 వేల మంది జనాభా ఉండగా ఇక్కడ అ నేక మంది వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలో చెత్తను నింపి రోడ్లపై వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నారు. పలు ప్రాంతాల్లో డ్రెయినేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపు 2 లక్షలకుపైగా ప్లాస్టిక్ కవర్లు, ఇతర నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు ఒక రోజులో వినియోగమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ మరుసటి రోజుకు చెత్తగా మారి డ్రెయినేజీల్లోకి చేరి కాలుష్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపతుంది. అధికారులు రెండేళ్ల క్రితం తనిఖీలు చేసి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లాస్టిక్ నిషేదం ఉంది అన్న విషయాన్ని సైతం అధికారులు మరచి పోయారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో భాగంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు, వినియోగంపై జిల్లాలో పలు చోట్ల నిషేధాజ్ఞల చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలపై అధికారులు కొంతకాలం పాటు అవగాహన కల్పించారు. విక్రయాలపై మొదట్లో కొరడా ఝళిపించారు. ఆ తర్వాత నిషేధంపై అధికారులు అంతగా పట్టించుకోకుండా వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం ప్రకటనలు, ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ యధేచ్చగా ప్లాస్టిక్ సంచులను విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అధికారులు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి ఉమ్మడి జిల్లాలో అనంతపురం నగర సంస్థలతో పాటు అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో అధికార యంత్రాంగం నిషేధ ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వ్యాపారులకు భారీగా జరిమానా విధించడానికి సైతం వెనుకాడమని, వరుసగా రెండు సార్లు పట్టుబడిన దుకాణాలను సీజ్ చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఆచరణలో అనేక చోట్ల ప్లాస్టిక్ వినియోగం యధావిధిగా జరిగిపోతుండగా అధికారులు చర్యలు ఎక్కడా కానరావడం లేదు.
పట్టణంలో మితిమీరి…
హిందూపురం పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం ప్రస్తుతం హద్దులు దాటింది. బహిరంగ మార్కెట్లలో ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు మితిమీరి వినియోగిస్తున్నారు. వాటిని రోడ్లపై, కాలువల్లో పడేస్తుండటం వల్ల మురుగు కాలువల్లో పేరుకుపోయి మురుగు ముందుకు పోకుండా ఉండేందుకు ఇదే ప్రధాన కారణంగా పారిశుధ్య విభాగం గుర్తించింది. రోడ్లపై వ్యర్ధాలను ప్లాస్టిక్ సంచుల్లో వేయడం వల్ల అవి తిన్న ఆవులు, పందులు, కుక్కలు జీర్ణవ్యవస్థ పని చేయక మరణిస్తున్నాయి. పట్టణ, గ్రామీణ మరణించిన జీ వాల్లో 90 శాతం ఇదే కారణంగా ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ తేల్చింది. పెట్రో కెమికల్ ద్వారా తయారయ్యే ప్లాస్టిక్ కవర్లలో వేడి పదార్థాలు వేయడం వల్ల కార్సినోజెనిక్ అనే ఉత్పాదిక రసాయనం విడుదలై క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికి కొంత మంది ఇడ్లీ తయారీలో, టీ, కాఫీ పార్సిల్ లో సైతం దీనిని వినియోగిస్తున్నారు. భూమిలో వందేళ్లయిన కరగని ఏకైక వస్తువు ప్లాస్టిక్ గా గుర్తించిన కొన్ని అధ్యయన సంస్థలు దీనిని పూర్తిగా నిషేధించాలని సూచిస్తున్నాయి.
తనిఖీలతో సరి….,
పురపాలక సంఘంలో ప్లాస్టిక్ నిషేధాజ్ఞలు పెట్టినప్పుడల్లా కొందరు అధికారులకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. గతంలో రెండుసార్లు ప్లాస్టిక్ నిషేధం విధించిన మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులతో కొన్ని రోజులు హ డావుడి చేసి వదిలేశారు. బహిరంగ మార్కెట్లలో ప్లాస్టిక్ సంచులు యథేచ్ఛగా దర్శనమిస్తున్నాయి.

నిషేధిత ప్లాస్టిక్ వాడకూడదు – శ్రీ కాంత్ రెడ్డి
భారత ప్రభుత్వం కొన్ని ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. వాటిని పూర్తిగా వాడకూడదు. ఒక్కసారి వినియోగించే పడేసే కవర్లపైనే మా దృష్టంతా, బహిరంగ మార్కెట్లలో ప్లాస్టిక్ వినియోగంతో పాటు ఉత్పత్తిపైన నిఘా పెడుతున్నాం. ప్రజల సహకారం ముఖ్యం. పట్టణ వ్యాప్తంగా ఆకస్మిక దాడులకు బృందాలను ఏర్పాటు చేసి, దశలవారీగా వార్డు సచివాలయాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను చైతన్య వంతులను చేస్తాం. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ గా తీర్చిదిద్దుతాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article