శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించాయి. ఈ వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ తరఫున పంపిన పసుపు, కుంకుమ, చీరలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ, శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పద్మజ ప్రతి ఆడపడుచిని ఆప్యాయంగా పలకరిస్తూ, బొట్టు పెట్టి, సారె అందచేశారు. అనంతరం, సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు మంత్రోచ్ఛరణలతో ఘనంగా వ్రతాన్ని నిర్వహించారు.ఉదయం 5 గంటల నుంచే పురూహూతిక అమ్మవారి ఆలయం వద్ద భక్తులు భారీగా తరలివచ్చి, భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మూడు బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహించే ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. కార్యక్రమం అనంతరం, పద్మజ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వ్రతమాచరించిన ఆడపడుచులందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
