పవన్ కళ్యాణ్ ఇటీవల బెంగళూరులో పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పర్యావరణ పరిరక్షణను ప్రస్తావిస్తూ, 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు చెట్లను కాపాడే పాత్రలు పోషించేవారని, ప్రస్తుతం మాత్రం హీరోలు చెట్లను నరికే స్మగ్లర్ల వేషాలు వేస్తున్నారని చెప్పారు. దీనికి ఉదాహరణగా ఆయన రాజ్ కుమార్ నటించిన ‘గంధడ గుడి’ చిత్రాన్ని ప్రస్తావించారు, అందులో రాజ్ కుమార్ అడవుల్లోని చెట్లను నరికకుండా స్మగ్లర్లను అడ్డుకునే పాత్రలో కనిపిస్తారు.పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను కొంతమంది నెటిజన్లు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినట్లు భావిస్తున్నారు. ‘పుష్ప’ మరియు ‘పుష్ప-2’ చిత్రాల్లో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర పోషించడంతో, పవన్ ఈ విధంగా టార్గెట్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికిన విషయం కూడా ఈ వివాదానికి మరింత కాస్త పదును పెట్టింది.

