పవన్ ప్రమాణం చేస్తుండగా ఆనందంగా తిలకించిన అన్నా లెజనోవా

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు ఏపీ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే ముందు పవన్ తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా… ఆయన భార్య అన్నా లెజనోవా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భర్త ప్రమాణం చేస్తుండడాన్ని ఆమె ఆనందంగా తిలకించారు. ఇటు చిరంజీవిలోనూ తమ్ముడు మంత్రిగా ప్రమాణం చేస్తుండడం పట్ల ఉత్సాహం వెల్లివిరిసింది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్… రెండు చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లలో, రెండు ఎంపీ స్థానాల్లో బరిలో దిగిన జనసేన… 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో గెలిచి సత్తా నిరూపించుకుంది.