రానున్న ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లను టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మాట్లాడుతూ జనసేనాని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తేలిపోయిందని… ఆయనను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్ ను పవన్ ఏమన్నారో… పవన్ ను చంద్రబాబు ఏమన్నారో వాళ్లు మర్చిపోయారని అన్నారు. సింగిల్ గా అయితే జగన్ ను ఎదుర్కోలేమనే… అన్నీ పక్కన పెట్టి కలిసిపోయారని విమర్శించారు. వపన్ ను సీఎం చేసుకోవాలని కాపు సోదరులు చాలా ఆశపడ్డారని… కానీ ఆయన విలువ కేవలం 24 సీట్లు మాత్రమేనని ఈరోజు తేలిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ 94 సీట్లు తీసుకున్నా చంద్రబాబుకు మళ్లీ సీఎం అయ్యే యోగం లేదని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా… కనీసం సొంత నియోజకవర్గం కుప్పంకు మంచి నీళ్లు ఇవ్వలేకపోయారని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.