Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుకొండచరియలు విరిగిపడిన ఘటన.. 2 వేల మందికి పైగా సజీవ సమాధి

కొండచరియలు విరిగిపడిన ఘటన.. 2 వేల మందికి పైగా సజీవ సమాధి

పపువా న్యూగినీ దేశంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 2 వేల మందికి పైగా సజీవ సమాధి అయ్యారని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆ ప్రాంతమంతా భౌగోళిక అస్థిరత్వం ఉండటం, సమీపంలో గిరిజనుల ఘర్షణలు జరుగుతున్న కారణంగా సహాయకచర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎంగా ప్రావిన్స్‌లోని ఎంబాలి గ్రామంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. కొండచరియల కింద చిక్కుకుని 670 మంది మృతి చెందినట్టు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అయితే, మృతుల సంఖ్య 2 వేలు దాటిందని స్థానిక జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ యూఎన్‌కు లేఖ రాసింది. అనేక భవంతులు, వనాలు నాశనమయ్యాయని పేర్కొంది. విపత్తు సంభవించిన ప్రాంతంలో సుమారు 4 వేల మంది ఉంటున్నారు. అయితే, స్థానిక జనాభా ఎంతనేది కచ్చితంగా చెప్పడటం కష్టమని అక్కడి అధికారులు అంటున్నారు. చివరి సారి జనాభా లెక్కలను 2000లో తీసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది మరోసారి జనగణన నిర్వహించనున్నట్టు అక్కడి ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
ఘటన జరిగిన ప్రాంతంలో భౌగోళిక అస్థిరత్వం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతం సుదూరాన ఉండటం మరో ప్రధాన అడ్డంకిగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులే రంగంలోకి దిగి క్షతగాత్రులను వెలికి తీసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పలుగు, పారలతో కొండచరియలను తవ్వుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విపత్తు కారణంగా ఇప్పటివరకూ 1250 మంది నిరాశ్రయులుగా మారారు. 150 ఇళ్లు సజీవ సమాధి కాగా మరో 250 ఇళ్లు నివాసయోగ్యం కాకపోవడంతో ప్రజలు వాటిని విడిచి వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article