ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు మారిందని పల్నాడు ఎస్పి మలికా గార్గ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం నవ్వుకునే విధంగా, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఘర్షణలకు పాల్పడే ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీచేసిన ఆమె పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ తన ప్రధాన కర్తవ్యమని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు.
పల్నాడు పేరు చెడగొట్టారు పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించిన ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పల్నాడు వరస్ట్ జిల్లా అనే ముద్ర పడిందని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వబోమన్నారు. పోలీసులు ఉన్నప్పటికీ పల్నాడులో జరిగిన దారుణమైన ఘటనలు పల్నాడు పేరు చెడగొట్టాయన్నారు. పల్నాడు ప్రజలంటే కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకొని రోడ్లమీద తిరుగుతారని దేశమంతా ప్రచారం అయిందని, ఇక ఇటువంటి ఘటనలు మళ్లీ జరగబోనివ్వనన్నారు.
ఒక్క పదిరోజుల వ్యవధిలో 160కేసులు ఘర్షణలకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన ఎస్పీ, ఇప్పుడు ఎక్కడ చూసినా పల్నాడుపైన చర్చ జరుగుతుందన్నారు. తన బ్యాచ్ మేట్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు పల్నాడు ఫ్యాక్షన్ గురించే తనకు ఫోన్ చేసి అడుగుతున్నారని, రాష్ట్రంలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు పల్నాడులో ఉన్నాయన్నారు. ఒక్క పదిరోజుల వ్యవధిలో 160కేసులు నమోదు చేయడాన్ని ఏ పోలీస్ అధికారి కోరుకోరన్నారు మలికా గార్గ్ . పల్నాడు అల్లర్ల నిందితులకు జైళ్ళు సరిపోవటం లేదు పల్నాడు తర్వాత స్థానంలో ఘర్షణలు జరిగిన జిల్లాలోనూ 70 కేసులు నమోదయ్యాయి అని పేర్కొన్నారు. ఘర్షణల కేసుల్లో ఇప్పటివరకు 1300 మందిని అరెస్టు చేశామని, 400మందిపై రౌడీ షీట్లు తెరిచామని ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. పల్నాడు అల్లర్లలో ఉన్న నిందితులను జైళ్లలో పెట్టేందుకు జైళ్ళు సరిపోవటం లేదని, అందుకే వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని చెప్పారు. నాయకుల కోసం సామాన్యులు జీవితాలు పాడు చేసుకోకండి గొడవల్లో జైలుకు వెళుతున్న వారు సామాన్యులని, అసలు కారకులైన డబ్బు, తెలివితేటలు ఉన్న నాయకులు మాత్రం బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. నాయకుల కోసం సామాన్యుల జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. కౌంటింగ్ రోజు ఎవరైనా తోక జాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని, ఖాకీ యూనిఫాం పవర్ ఏంటో చూపిస్తాను అంటూ ఎస్పీ మలికా గార్గ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.