విశాఖకు వచ్చే ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యతల నుంచి అమర్ నాథ్ ను తప్పించిన జగన్
విశాఖ:మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు ముఖ్యమంత్రి జగన్ మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జీగా మరొకరిని జగన్ నియమించారు. అమర్ నాథ్ కు టికెట్ నిరాకరించారు. తాజాగా మరో విషయంలో ఆయనను పక్కన పెట్టారు. ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ ఈరోజు విశాఖకు వస్తున్నారు. అమర్ నాథ్ మంత్రి అయిన తర్వాత విశాఖకు ప్రముఖులు వచ్చే సమయంలో వారికి స్వాగతం పలికే బాధ్యతను ఆయనకు జగన్ అప్పగించేవారు. అయితే ఈసారి ఆ బాధ్యతను మంత్రి బూడి ముత్యాలనాయుడుకు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యతల నుంచి కూడా అమర్ నాథ్ ను తప్పించడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.