విజయవాడలో భారీ వర్షాల కారణంగా మరోసారి కొండచరియలు విరిగి పడడంతో ఒకరు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మాచవరం వద్ద చోటుచేసుకుంది. కొద్దిరోజుల కిందట కూడా కొండచరియలు విరిగిపడిన సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం మరువకముందే, మరొక ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది.ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా తీరం దాటడంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేయబడగా, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.