టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూడా ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నారు. నందమూరి చైతన్యకృష్ణ, నారా రోహిత్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి కేసరపల్లి ఐటీ పార్కుకు బయల్దేరారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల్లో సభా ప్రాంగణం, 65 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రముఖులు, వివిధ దేశాల కాన్సులేట్ జనరల్స్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో, 7 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.