బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థులు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో ఏర్పాటైన ఈ సమావేశంలో తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా మోదీని ఎన్నుకున్నారు.
అనంతరం మోదీ మాట్లాడారు. 10 సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పెను మార్పులు, సంక్షేమం, అభివృద్ధి, దేశం సాధించిన పురోగతిని చూసే ప్రజలు మూడోసారి తమకు పట్టం కట్టారని అన్నారు. ఈ దఫా ప్రభుత్వం మరింత కొత్తగా పరిపాలన సాగిస్తుందని హామీ ఇచ్చారు. ఎన్డీఏ అనే పదాలకు మోదీ ఈ సందర్భంగా కొత్త అర్థం చెప్పారు. ఎన్డీఏ అంటే- న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, యాస్పిరేషనల్ ఇండియా.. అని చెప్పుకొచ్చారు. తదుపరి అయిదు సంవత్సరాల వ్యవధిలో దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని, ఆర్థికంగా ప్రపంచంలోనే శక్తిమంతంగా మలచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని అన్నారు. తనకు ఈ జన్మ లభించింది.. భరతమాత కోసమేనని మోదీ ఉద్వేగంగా చెప్పారు. తన జీవితాన్ని వన్ లైఫ్ వన్ మిషన్‌గా అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయులు కన్న కలలను సాకారం చేయడానికే ఈ జీవితంఉందని పేర్కొన్నారు. దీనికి 10 సంవత్సరాల కిందటే పునాది పడిందని అన్నారు.


ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాపైనా మోదీ నిప్పులు చెరిగారు. అబద్ధాలు చెప్పడంలో ఇండియా కూటమి నాయకులు పీహెచ్‌డీ పూర్తి చేశారని ఎద్దేవా చేశారు. వీటికి దూరంగా ఉండాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్‌లతో దేశం నడవబోదని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ కేబినెట్‌లో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తోన్నాయని, వాటిల్లో చిక్కుకోవద్దని కోరారు. తమ ప్రభుత్వ పరిపాలన తీరును చూసిన తరువాతే దక్షిణాది రాష్ట్రాలు కూడా బీజేపీ/ఎన్డీఏను ఆదరించాయని వ్యాఖ్యానించారు మోదీ. కర్ణాటక, తెలంగాణల్లో అంచనాలకు మించిన సీట్లను సాధించామని అన్నారు. కేరళలో కూడా ఖాతా తెరవగలిగామని పేర్కొన్నారు. ఈ అయిదేళ్లల్లో ఇండియా కూటమికి ఎక్కడా చోటు లభించబోదని ధీమా వ్యక్తం చేశారు.
