- ఆయుధ కర్మాగార ప్రాజెక్ట్ ఏర్పాటు ద్వారా యువతకు 6 వేల ఉద్యోగాల కల్పన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.
- ట్రైకార్ ఛైర్మెన్ బొరగం శ్రీనివాసులుతో కలిసి పోలవరంలో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
పోలవరం:పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. పోలవరంలో ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులుతో కలిసి టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గం పరిధిలో ఆయుధ కర్మాగారం ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలోని 6 వేల మంది యువతకు ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని, పోలవరం నియోజకవర్గం అభివృద్ధి దృష్ట్యా ప్రాజెక్ట్ ఏర్పాటుకు సహకరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పోలవరం నియోజకవర్గం పరిధిలోని ప్రతి సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాలను ప్రథమ స్థానంలో నిలిపేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సూచించారు. పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ కోరారు. గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కుంటుపడిందని, ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టినట్లు ఎంపీ తెలిపారు. పోలవరం నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న కొందరు అధికారులు తమ పనితీరుని మార్చుకోవాలని ఎంపీ సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, అధికారులు ప్రజలకు బాధ్యతగా ఉంటూ పనిచేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిబ్రవరి 8 నుంచి నాయకులు, కార్యకర్తలు, అధికారులతో మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని ఎంపీ పేర్కొన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి పనిచేయని అధికారుల విషయంలో ఉపేక్షించేది లేదని ఎంపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకువెళ్లి పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడి తీసుకువచ్చామని, నియోజకవర్గాల పర్యటన సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని తమ కార్యాలయంలో ఆన్లైన్ చేస్తున్నామని, సమస్యల పరిష్కారానికి సంబంధించిన పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు అర్జీదారులకు తెలియజేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బొరగం శ్రీనివాసులు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.