Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుహమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ మహిళా సైనికులకు చిత్రహింసలు..

హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ మహిళా సైనికులకు చిత్రహింసలు..

గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేసి, 1200 మందిని కాల్చి చంపారు. 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఏడుగురు మహిళా సైనికులు కూడా ఉన్నారు. తాజాగా వీరిలో ఒకరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరో మహిళ ఉగ్రవాదుల చెరలోనే మరణించగా, మిగతా ఐదుగురు మహిళా సైనికులకు చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మీడియా దీనిని విడుదల చేసింది. బందీలుగా ఉన్న ఐదుగురు మహిళా సైనికుల చేతులు కట్టేసి ఉన్నాయి. ఓ గోడకు ఆనుకుని వారు నిలబడ్డారు. వారిలో కొందరిని జీపు ఎక్కిస్తున్నప్పుడు వారి ముఖాలు రక్తసిక్తమై కనిపించాయి. బాధితులను లిరి అల్బాగ్, కరీనా అరివ్, అగమ్ బెర్గర్, డానియెలా గిల్బోవా, నామా లెవీగా గుర్తించారు. నహాల్ ఓజ్ నుంచి కిడ్నాప్ చేసి వీరిని తీసుకెళ్లారు. వీరంతా ఇప్పటికీ గాజాలో ఉన్నారు. ముష్కరుల్లో ఒకడు అరబిక్‌లో బందీలపై అరవడం వినిపించింది. ‘‘మీరు కుక్కలు. మిమ్మల్ని తొక్కేస్తాం’’ అని పెద్దగా అరిచాడు. 19 ఏళ్ల బందీ నామా లెవీ ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. పాలస్తీనాలో తనకు స్నేహితులు ఉన్నారని అభ్యర్థించింది. మరో ఉగ్రవాది మాట్లాడుతూ.. ‘‘మీరు చాలా అందంగా ఉన్నారు’’ అంటే మరొకడు ‘‘వీరు గర్భవతులు అవుతారు’’ అన్నాడు.ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఆ వీడియో తనను కలచివేసిందని చెప్పారు. బందీలను విడిపించి సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చేందుకు తాను చేయాల్సింది చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. హమాస్ టెర్రరిస్టులు క్రూరంగా ప్రవర్తించారని, ఇది మరోమారు జరగకుండా హమాస్‌ను పూర్తిగా నిర్మూలించే వరకు పోరాడాలన్న తన సంకల్పాన్ని ఈ వీడియో మరింత బలపరుస్తోందని పేర్కొన్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిదన్న దానిపై స్పష్టత లేదు. వారింకా బందీలుగా ఉన్నారా? లేదా? అనేది తెలియరాలేదు. మరోవైపు, ఈ వీడియోపై హమాస్ కూడా స్పందించింది. బందీలపై తాము భౌతిక దాడులకు పాల్పడలేదని, ఆపరేషన్ సమయంలో చిన్నచిన్న గాయాలు సహజమేనని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article