నైరుతి రుతుపవనాల ఆగమనంపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ నికోబార్ దీవులను తాకాయని వెల్లడించింది. ఈ నెల 31న కేరళ తీరాన్ని తాకడం ద్వారా నైరుతి రుతుపవనాలు భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం రుతుపవనాల కదలికలను మరింత వేగవంతం చేస్తుందని, రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు దోహదపడుతుందని వివరించింది. భారత్ లో సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ 1న ప్రారంభమై సెప్టెంబరుతో ముగుస్తుంది. ఈసారి ‘లా నినా’ పరిస్థితుల కారణంగా దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే అంచనాలు వెలువరించింది.