Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఐక్య కూటమి గ్రామీణ బంద్ ప్రశాంతం

ఐక్య కూటమి గ్రామీణ బంద్ ప్రశాంతం

బుట్టాయగూడెం:
బుట్టాయగూడెం మండల కేంద్రంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా కార్మిక, కర్షక, రైతాంగ ఐక్య కూటమి ఆధ్వర్యంలో గ్రామీణ బంద్ నిర్వహించారు. ఈ బంద్ కు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సిపిఎం, సిబిఐ, అఖిల భారత రైతు కూలిసంఘం (ఏఐకేఎంఎస్ ) గిరిజన సంఘం, రైతు సంఘం, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటీయూసీ , తదితర రాజకీయ,ప్రజా సంఘాల నేతలు నాయకత్వం వహించారు. ఏఐకేఎంఎస్ మండల నాయకుడు తగరం బాబురావు అధ్యక్షతన జరిగిన
ఈ బందులో ఆయా సంఘాల నాయకులు కారం రాఘవ, మొడియం నాగమణి, తెల్లం రామకృష్ణ, కారం దారయ్య, కట్టం వీరస్వామి, బన్నె వినోద్ లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు, కర్షకులకు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతాంగాన్ని, రైతుల హక్కులను కాలరాస్తున్నారని, కనీస మద్దతు ధర చట్టం చేయాలని,పంజాబ్ హర్యానా మహారాష్ట్ర రైతులు చలో ఢిల్లీ పిలుపు ఇస్తే, వారు ఢిల్లీలోకి అడుగు పెట్టకుండా రోడ్లకు అడ్డంగా సిమెంటు గోడలు నిర్మించి, ఇనప కంచెలు వేసి, రోడ్లమీద మేకులు కొట్టి, రైతులపై పోలీసులతో దాడులు చేయించడం, రైతులపై పొగ బాంబులు, బాష్ప వాయువులు, రబ్బర్ గుళ్లతో రైతులను గాయపరచటాన్ని పూర్తిగా ఖండించారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులు పంటలు పండించి ఈ దేశాన్ని బ్రతికిస్తే నరేంద్ర మోడీ రైతుల మెడలకు ఉరి తాళ్ళు బిగించడానికి చూస్తున్నాడని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని రైతు పండించిన పంటకు మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లకింపూర్ కేరి లో రైతుల మారణకాండలో ప్రధాన కుట్రదారుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను పదవి నిన్ను తొలగించి, ప్రాసిక్యూట్ చేయాలని కోరారు. మహిళలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా సామూహిక పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలు చేసి కార్మికులు సాధించుకున్న 44 కోడ్లుగా ఉన్న కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం నాలుగు కోడ్లుగా మార్చటం దుర్మార్గమన్నారు. నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలకు 26 వేల రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు. రైతు, కార్మికుల కుటుంబాలకు సమగ్ర రుణమాఫీని ప్రకటించాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలను పెంచి, ఆడ, మగ తేడా లేకుండా సమాన వేతనం 600 రూపాయల కూలి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగివచ్చి, ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కచ్చెల పోతిరెడ్డి, తామ ముత్యాలమ్మ, పోలోజు నాగేశ్వరరావు, కాగడ కన్నారావు, ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article