నకిలీ సిమ్‌కార్డులతో జరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా సిమ్‌కార్డుల జారీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. యథేచ్ఛగా జారీ అవుతున్న సిమ్‌కార్డులను ఉపయోగించుకుని నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికమ్యూనికేషన్ చట్టం-2023లో తీసుకొచ్చిన నిబంధనలను సెప్టెంబరు నుంచి అమల్లోకి తీసుకురావాలని డీవోటీ నిర్ణయించింది.కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అడిగిన వెంటనే సిమ్‌కార్డు జారీ ఉండదు. బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్ జారీచేస్తారు. అలాగే స్పెక్ట్రమ్ కేటాయింపులతోపాటు శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించి కూడా నిబంధనలు రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలన్నా స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది.