ఆగస్టు 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారి ఆకలి తీర్చే “అన్న క్యాంటీన్లు” ప్రారంభం కానున్నాయి. ఈ క్యాంటీన్లు 16వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల్లో మొత్తం 100 క్యాంటీన్లను తొలి విడతలో ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా ఉయ్యూరులోని క్యాంటీన్‌ను స్వయంగా ప్రారంభిస్తారు.గతంలో టీడీపీ హయాంలో ఇదే విధంగా క్యాంటీన్లు నడపబడినప్పుడు కేవలం రూ.5 నామమాత్రపు ధరకే రుచికరమైన భోజనం అందించేవారు. ఈ క్యాంటీన్లకు వలస కూలీలు, కార్మికులు, నిరుద్యోగ యువత మంచి ఆదరణ చూపారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది. అయితే ఈసారి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లకు పూర్వ వైభవం రానున్నాయి.

