జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత పరిశ్రమ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన పాత్ర పోషించిందని, ప్రస్తుతం తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ముఖ్యంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. చేనేతకు పునరుజ్జీవనం కల్పించడానికి తమ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, ఈ దిశగా మహిళా శక్తి గ్రూపులు, ప్రభుత్వ శాఖల ద్వారా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలియజేశారు.
ఈ సందర్భంగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ (మునుపటి ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా పౌరులను చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలకు ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చింది. “నిండైన భారతీయతకు నిజమైన అందాన్ని ఇచ్చే చేనేత వస్త్రాలను ధరిద్దాం” అని పేర్కొంటూ, నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

