
అనంతపురము :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు అనంతపురం జిల్లా సరిహద్దుల్లో అఖండ స్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోమవారం జిల్లా సరిహద్దులో గుత్తి మండలంలోని సుంకులమ్మ గుడి వద్దకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేరుకున్నారు. సుంకులమ్మ గుడి వద్ద అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుంకులమ్మ గుడిలో అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గుత్తి పట్టణానికి చేరుకోగా, ప్రజా ప్రతినిధులు, నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. గుత్తి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
