దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలు మార్గదర్శకాలు ఖరారు చేసారు. ఏటా మూడు సిలిండర్ల అందించేలా క్యాలెండర్ నిర్ణయించారు. అదే విధంగా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా పథకం అమలు కానుంది.ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఈ దీపావళి నుంచి అమలు కానుంది. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చే ఈ పథకం కోసం ప్రభుత్వం పైన ఏటా దాదాపుగా రూ 2,684 కోట్ల మేర భారం పడనుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఈ పథకం అమలు కానుంది. ఈ పథకం అమలు కోసం ఈ నెల 27 లేదా 28వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నారు.రేషన్ కార్డు ఉన్నవారికి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతీ కుటుంబానికి ఈ పథకం అమలు అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పు కొచ్చారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని.. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ ఇచ్చేలా షెడ్యూల్ ఖరారు చేసారు. ఏప్రిల్-జూలై మధ్య మొదటి సిలిండర్, ఆగష్టు-నవంబర్ మధ్య రెండో సిలిండర్, డిసెంబర్-మార్చి 31 మధ్య మూడో సిలిండర్‌ను ఇవ్వనున్నట్టు మంత్రి మనోహర్ వెల్లడించారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ అమౌంట్‌ను 48 గంటల్లో జమ చేయనున్నారు. మంత్రివర్గంలో చర్చ తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పథకం అమల్లో భాగంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం పైన చర్చ జరిగింది. ఫించన్లు ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నట్లే .. సిలిండర్లను అందిస్తే బాగుంటుందనే ప్రతిపాదన వచ్చింది. లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో కంటే ఇంటికి వెళ్లి ఇస్తే ఎక్కువ ప్రభావం ఉంటుందని కొందరు మంత్రులు సూచించారు. అయితే, తనకు అలాంటి ఆలోచన ఉందని .. కానీ, అయిదు రాష్ట్రాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాయని .. ప్రస్తుతానికి అదే విధానం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అమలు ప్రారంభించిన తరువాత అవసరమైన మార్పులు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.